పేదల గూడు పదిలం
క్రమబద్దీకరణకు సర్కారు నిర్ణయం
ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్
హైదరాబాద్,డిసెంబర్30(జనంసాక్షి): రాష్ట్రంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని పేదలు కట్టుకున్న నిర్మాణాలను క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. హైదరాబాద్‌లో భూముల క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారు. భూముల క్రమబద్ధీకరణ అంశంపై అధికారులతో సీఎం జరిపిన సవిూక్ష సమావేశంలో భూముల క్రమబద్ధీకరణకు అనుసరించాల్సిన విధి విధానాలపై అధికారులకు మార్గనిర్ధేశం చేశారు. 125 గజాల లోపు ఉన్నవారికి ఇది వర్తింపచేయాలని నిర్ణయించారు. అసెంబ్లీలో చేసిన తీర్మానం, అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో చేసిన తీర్మానం, అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నిరుపేదల పట్ల అత్యంత సానుభూతితో ఉండే విధంగా క్రమబద్దీకరణ నిబంధనలు రూపొందిచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్రమబద్దీకరణ జీఓలో పొందుపర్చాల్సిన మార్గదర్శకాల రూపకల్పన కోసం సచివాలయంలో మంఘళవారం సవిూక్షా సమావేశం నర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ.,పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్,రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ,సిఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, అడ్వకేట్ జనరల్ రామకృష్లారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి,రెవిన్యూ కార్యదర్శి విూనా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్, సిసిఎల్‌ఎ స్పెషల్ కవిూషనర్ జి.డి.అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి అడ్డుకట్ట వేయటం,ప్రతి భూమికి టైటిల్ కలిగియుండటం వంటి లక్ష్యాలు సాధించడమే క్రమబద్దీకరణ ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. నిరుపేదలు వివిధ జిల్లాల నుండి హైదరాబాద్‌కు వచ్చి తలదాచుకోవడానికి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు,షెడ్లు,ఇండ్లు నిర్మించుకున్నారని, అయినా వాటికి పట్టాలు లేకపోవడం వల్ల అవస్థలు పడుతున్నారన్నారు. అలాంటి పేదలకు ఉచితంగానే భూమిని రెగ్యులరైజ్ చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో పొందుపరచాల్సిన మార్గదర్శకాలను ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు.125 గజాల లోపు స్థలంలో నివాసం ఏర్పరుచుకున్న దారిద్యరేఖకు దిగువన ఉన్న పేదలకు ఉచితంగానే రెగ్యులరైజ్ చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితిని రెండు లక్షలకు పెంచినందున, ఆ లోపు ఆదాయం ఉన్న వారిని పేదలుగానే గుర్తించాలన్నారు. అలాగే 250 గజాల వరకు స్థలంలో నివాసం ఏర్పరుచుకున్న వారికి రిజిస్టేష్రన్ ధరలో 50శాతం తీసుకుని రెగ్యులరైజ్ చేయాలన్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో 500 గజాల వరకు స్థలంలో నివాసం ఏర్పరుచుకున్న వారికి రిజిష్టేష్రన్ ధరలో 75శాతం తీసుకుని రెగ్యులరైజ్ చేయాలి. 500 గజాలకు పైన ఉన్న స్థలంలో నివాసం ఏర్పరుచుకున్న వారు 100 శాతం రిజిష్టేష్రన్ ధర చెల్లించి రెగ్యులరైజ్ చేయించుకోవాలి. వ్యాపార అవసరాల కోసం వాడుకునే స్థలం పరిమాణంతో సంబందం లేకుండా మొత్తం రిజిస్టేష్రన్ ధర చెల్లించి రెగ్యులరైజ్ చేయించుకోవాలి. ఆసుపత్రులు, విద్యాసంస్థల లాంటి వాటిని కూడా వ్యాపార సంస్థలుగానే గుర్తించాలి. జూన్ 2,2014 లోపు నివాసం ఉన్న వారికి మాత్రమే రెగ్యులరైజేషన్ అవకాశం కల్పించాలి. ఆలోపు సంబధిత ప్రాంతంలో తాము నివాసం ఉంటున్నట్లు చూపాలి.రేషన్ కార్డు, ఆధార్‌కార్డు,ఓటర్ కార్డు లాంటివి ఏవైనా ధరఖాస్తుతో పాటు జతపరచాలి. రెగ్యులరైజేషన్ కోసం ధరఖాస్తు చేయడానికి 20రోజులు గడువు ఇవ్వాలి. దరఖాస్తు దారుడు తమ దరఖాస్తుతో పాటు నిర్ణయించిన ధరలో 25శాతం డబ్బులను డిడి రూపంలో సమర్పించాలి. జెసి,ఆర్‌డిఓల పర్యవేక్షలణలో దరఖాస్తుల పరీశీలన, ఫిర్యాదుల పై విచారణ, తదితర కార్యక్రామాలు జరగాలి. 90 రోజుల్లోగా రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తి కావాలి. ఏలాంటి నిర్మాణాలు లేకుండా ఖాళీగా వున్న భూములను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని వేలం నిర్వహించాలి. రెగ్యులరైజ్ చేసిన తరువాత మహిళల పేరు విూదనే పట్టాలు ఇవ్వాలి. అధికారులు విచారణ జరిపే సందర్భంగా ఏ ప్రాంతంలో, ఎంత స్థలంలో, ఏ ఇంట్లో నివాసం ఉంటున్నారో గుర్తించి ఫోటోలు కూడా తీసుకోవాలి. రెగ్యులరైజేషన్ ప్రక్రియలో సహకరించడానికి రిటైర్డు రెవిన్యు అధికారుల సేవలను వినియోగించుకోవాలి. భూముల రెగ్యులరైజేషన్ తో పాటు వివిధ జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ భూముల వేలానికి సంబంధంచి కూడా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. చాలా జిల్లాల్లో చిన్నబిట్ల రూపంలో ముక్కలు ముక్కలుగా ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వం వాటిని ఏ అవసరాలకు వినియోగించలేకపోతున్నది. దీనివల్ల ఆ భూమి కబ్జాకు గురవుతున్నది. దీనిని నివారించడానికి అలాంటి బిట్లను వేలం వేయాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. జిల్లా కలెక్టర్లు ప్రతిపాదించిన అలాంటి బిట్లను వేలం వేయడానికి ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో నాలాల నిర్వహణ సరిగా లేదని, నాలాలు ఆక్రమణకు గురయ్యాయని ముఖ్యమంత్రి అన్నారు. వర్షపు నీరు, మురుగునీరు రోడ్లపై ప్రవహించడానికి ఇదే కారణమని చెప్పారు. నాలాలపై ఆక్రమణలు తొలిగంచే విషయంలో, వాటిని సక్రమంగా నిర్వహించే విషయంలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.