పేదల బస్తీలు మారాలి – మహబుబ్‌నగర్‌లో సీఎం కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన కొనసాగుతోంది. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్ చేరుకున్న సీఎంకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పాలమూరులోని పలు మురికి వాడలను సీఎం స్వయంగా పరిశీలించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, ఆహార భద్రత కార్డులు రాలేదంటూ ఈ సందర్భంగా స్థానికులు ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి, శ్రీనివాస్ణ్‌ొడ్, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌లో మంచినీటి వ్యవస్థ సరిగా లేదు: కేసీఆర్
మహబూబ్‌నగర్‌లో మంచినీటి వ్యవస్థ సరిగా లేదని, 14, 15 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పేదరిక నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. స్వయం ఉపాధి కార్యక్రమాలు పేదలకు అందిస్తామన్నారు. ఇప్పుడున్నది మునుపటి రాజకీయం కాదని, రాజకీయం చేద్దామంటే తెలంగాణ వచ్చి లాభం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బస్తీల్లోని పరిస్థితి అత్యవసరంగా మారాల్సిన పరిస్థితి ఉందన్నారు. పాతపాలమూరులోని బస్తీల అభివృద్ధికోసం ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని ఆయన సూచించారు.