పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ లో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్లకి సంబందించిన నూతన కార్డులను జెడ్పి చైర్ పర్సన్ గుజ్జా దీపికా యుగంధర్, జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ లతో కలసి పెన్ పహాడ్ లబ్ధిదారులు 1295, చివ్వేంల మండలం 1067 మంది లబ్దిదారులకు అందజేశారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తున్నామని అన్నారు.సూర్యాపేట నియోజకవర్గంలో 72 వేల కుటుంబాలు ఉండగా వాటిలో 60 శాతం మంది పింఛన్లు పొందుతున్నారని చెప్పారు.ఇప్పటి వరకు వివిధ రకాల పింఛన్ల కింద రూ.600 కోట్లను లబ్దిదారులకు అందించామని చెప్పారు.తెలంగాణలో జరిగే అభివృద్ధిపై ఇతర రాష్ట్రాలలో చర్చ జరుగుతుందని, దేశంలోని మరే రాష్ట్రాలలో కూడా కళ్యాణలక్ష్మీ , షాదీ ముబారక్, రైతు బంధు పథకాలు లేవని ముఖ్యంగా రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.కొన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేస్తున్నారని, ఇచ్చే 6 గంటల కరెంటులో కోతలు విధిస్తూన్నారని పేర్కొన్నారు.ఇతర రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు, ఉన్నతాధికారులు తెలంగాణ అభివృద్ధిని పరిశీలించి వెళుతున్నారని అన్నారు.తెలంగాణలో గంగా జామున తెహజీబ్ ఉందని ఒకరినొకరు సోదర భావంతో పండుగలు గొప్పగా జరుపు కుంటున్నారని తెలిపారు.జిల్లా రైతాంగంలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చి పంట సాగులో జిల్లాను రాష్ట్రంలో ముందంజలో ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పి సిఈఓ సురేష్ , ఆర్డిఓ రాజేంద్ర కుమార్ , పిడి కిరణ్ కుమార్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీలు నెమ్మది బిక్షం, కుమారి బాబు నాయక్ , జడ్పీటీసీ సంజీవ నాయక్, అధికారులు , ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.