పేరు గొప్ప…ఊరు దిబ్బ అన్నట్లుగా మిషన్ భగీరథ పథకం
*పేరు గొప్ప…ఊరు దిబ్బ అన్నట్లుగా మిషన్ భగీరథ పథకం*
బయ్యారం, ఆగష్టు 29(జనంసాక్షి):
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో మిషన్ భగీరథ పథకం ఒకటి.ఇంటింటికి త్రాగు నీరు అందించే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో మారుమూల గ్రామాల్లో సైతం ప్రజలు గుక్కెడు నీరు లేక పడుతున్న అవస్థలను రూపుమాపే దిశగా వేసిన అడుగులకు కార్య రూపమే మిషన్ భగీరథ పథకం. కానీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఊహించిన స్థాయిలో ప్రజల మన్నలను పొందలేకపోయింది.భగీరథ పైప్ లైనులు ప్రతీ గ్రామానికి వచ్చినప్పటికి నీరు మాత్రం రాకపోవడం గమనార్హం.కొన్నిచోట్ల త్రాగునీరు మురికిగా వచ్చినా సర్పంచులు గానీ, సంబంధిత అధికారులుగాని చొరవ చూపడంలో నిర్లక్ష్యం వహించిన ఘటనలు కూడా ఉన్నాయి. కాగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఎస్సీ కాలనీ లో గత పదిరోజులుగా త్రాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.తమకు అందాల్సిన మిషన్ భగీరథ త్రాగు నీరు అందకపోవడంతో సోమవారం బిందెలతో కాలనీవాసులు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… గత పదిరోజులు గా కాలనీ లో త్రాగునీరు రావడం లేదని,అధికారులు ఎవరో పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కూలి చేసుకొని బ్రతికే తమకు రోజుకి 20 రూపాయలు వెచ్చించి మినరల్ వాటర్ కొని త్రాగే పరిస్థితి లేదని,పదిరోజులు గా నీళ్లు లేక వృద్దులు,చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.కాలనీ లో ఉన్న బావి గతంలో తమ దాహర్తి తీర్చిందని, మిషన్ భగీరథ పథకం రావడంతో ఈ బావి కి అమర్చిన మోటారు వల్ల కరెంట్ బిల్లు అధికం గా వస్తుందని బయ్యారం గ్రామ సర్పంచ్ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు.ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ గోడును అర్ధం చేసుకొని సమస్య ను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.