పొందూరు చేనేతకు కేంద్రం అండగా ఉంటుంది


కేంద్రమంత్రితో చర్చించి సమస్యలు పరిష్కరిస్తా
ఖాదీ ఉత్పత్తులు 18వేల కోట్లకు పెరిగిన ఖాదీ ఉత్పత్తులు
శ్రీకాకుళం పర్యటనలో మంత్రి నిర్మలా సీతారామన్‌
శ్రీకాకుళం,ఆగస్టు7(జనంసాక్షి): పొందూరు చేనేత సమస్యలపై సంబంధిత మంత్రితో చర్చిస్తానని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా పొందూరు చేనేత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అర్హులైన చేనేత కార్మికులకు బ్యాంకులు ఆర్థిక సహకారం అందించాలన్నారు. ఖాదీకి ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె పేర్కొన్నారు. గత పదేళ్లలో ఖాదీ ఉత్పత్తులు 18వేల కోట్లకు పెరిగాయని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ పేర్కొన్నారు. ఇదిలావుంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ గో బ్యాక్‌ అంటూ.. విశాఖ వేడెక్కెతోన్న వేళ… నిర్మల సీతారామన్‌ 3 రోజుల ఉత్తరాంధ్ర పర్యటన శనివారం ప్రారంభమయింది. శనివారం శ్రీకాకుళం జిల్లా పొందూరుకు నిర్మల సీతారామన్‌ చేరుకున్నారు. అక్కడ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గని పొందూరు ఆంధ్రా ఫైన్‌ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘాన్ని సందర్శించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేంద్ర చేనేతకారుల దినోత్సవంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సీతారామన్‌ పాల్గొన్నారు. ఆదివారం నిర్మలా సీతారామన్‌ విశాఖ జిల్లాలో పర్యటించి వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సందర్శించనున్నారు.. గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మృతివనంను సందర్శించనున్నారు. తాళ్లపాలెంలో రేషన్‌ పంపిణీ విధానాన్ని పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్ధిక మంత్రి రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఆర్ధిక శాఖ అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటికే విశాఖలో ఉక్కు కార్మికుల నిరసనలు భగ్గుమంటున్నాయి. శుక్రవారం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న నిర్మల సీతారామన్‌కు ఉక్కు కార్మికుల నిరసన సెగ తగిలింది. మంత్రికి వినతిపత్రాన్ని ఇచ్చేందుకు వెళ్లిన నేతలను బలవంతపు అరెస్టులు చేశారు. నిర్మల సీతారామన్‌ గో బ్యాక్‌ అంటూ.. ఈరోజు నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ.. రేపు కేంద్ర మంత్రి విశాఖ పర్యటన ఉత్కంఠ రేపుతోంది.