పోడు భూముల ట్రెంచ్ విషయంలో ఫారెస్ట్ అధికారుల అత్యుత్సాహం
బయ్యారం,ఆగష్టు07(జనంసాక్షి):
పోడు భూముల విషయంలో ప్రతీ రోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట ఎదో ఒక మూలన కార్చిచ్చు రగులతూనే ఉంది. బయ్యారం మండలం చర్లపల్లి పంచాయతీ పరిధిలోని బండ్లకుంటకు సంబంధించిన యాప కన్నయ్య గత 40 సంవత్సరాల నుండి పోడు భూమిని సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు.ఇటీవల బయ్యారం అటవీ అధికారులు పోడు భూములకు ట్రెంచ్ వేసే క్రమంలో కన్నయ్యకు సంబంధించిన పోడు భూమిలో ట్రెంచ్ వేయడానికి ఫారెస్ట్ అధికారులు ప్రయత్నించిన సమయంలో తమకు అన్యాయం చేయొద్దని వేడుకున్నారు.ఇప్పటికే ప్రత్తి పంట వేశామని సుమారు లక్ష రూపాయల విలువ గల పంట నష్టం జరుగుతుందని ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, అడ్డుకోవడానికి ప్రయత్నించిన కుటుంబీకులను,మహిళలను దుర్బాషలాడుతూ,కాళ్ళమీద పడినా నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.వేసవి కాలంలో పోడు చేసే సమయంలో అడ్డుకొని అధికారులు పెట్టుబడులు పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి అడ్డగోలుగా ట్రెంచ్లు వేస్తున్నారని బాధితులు అన్నారు. ట్రెంచ్ వేసే సమయంలో ఫారెస్ట్ బీట్ అధికారికి అడిగిన లంచం ఇవ్వలేదనే కక్ష పూరితంగా పంట నాశనం చేశారని బాధితులు వాపోయారు.ఓట్లు సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన నాయకులు మాకు అన్యాయం జరుగుతుంటే చోద్యం చూస్తున్నారని ఆరోపించారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసిఆర్ పోడు భూములకి పట్టాలిస్తామని హామీ ఇచ్చినా మాటలకే పరిమితమయ్యాయని ఆదివాసీ రైతులు వాపోతున్నారు