పోడు భూముల సత్వరపరిష్కార నిమిత్తం పనులు వేగవంతం చేయాలి.

 వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
 వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి అక్టోబర్ 12
పోడు భూముల  సత్వర పరిష్కార నిమిత్తం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల  అధికారులు ఆదేశించారు.   బుధవారం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో పోడు వ్యవసాయ భూముల పురోగతిపై  రెవెన్యూ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోడు భూముల సమస్యల పరిష్కారానికి అక్టోబర్ నెలాఖరులోగా పూర్తి  అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.   క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వచ్చిన అర్జీలన్నింటిని పరిగణలోకి తీసుకొని క్షేత్రస్థాయిలో వెళ్లి ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా  సర్వే నిర్వహించి హ్యాబిటేషన్ల వారీగా డివిజనల్ స్థాయి కమిటీకి నివేదిక సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.  అదేవిధంగా సర్వే పూర్తి అయిన వాటిని వివరాలను మొబైల్ యాప్ లో పొందుపరచాలని  కలెక్టర్ సూచించారు.  ధ్రువీకరణ, సర్వే ప్రక్రియ చేపట్టే ముందు గ్రామాల్లో చాటింపు (టాంటాం) వేయించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు ఎఫ్ఆర్సి కమిటీలు తప్పనిసరిగా ధ్రువీకరణకు వెళ్లాలని, అలాగా ధ్రువీకరణ ప్రక్రియను సమగ్రంగా రోజువారీగా డివిజన్ స్థాయి కమిటీకి పంపాలని కలెక్టర్ ఆదేశించారు.   పోడు భూముల అర్జీల పరిష్కార నివేదికలు పూర్తి అయ్యేవరకు అధికారులు సిబ్బంది ఎవరు కూడా సెలవులో వెళ్ళొద్దని, సెలవుల్లో వెళ్ళిన వారిని కూడా  విధులకు రప్పించుకొని పోడు భూముల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ తాసిల్దారులను ఆదేశించారు.    ఈ సమావేశంలో   జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, వికారాబాద్ ఆర్డిఓ విజయకుమారి, గిరిజన అభివృద్ధి అధికారి కోటాజి,  ల్యాండ్ రికార్డ్స్ ఏడి రాంరెడ్డి  తో పాటు   తాసిల్దారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ,  సర్వేయర్లు  పాల్గొన్నారు.