పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి

అటవీ ప్రభుత్వ శాఖల మధ్య గొడవలు లేకుండా సరిహద్దులను గుర్తించాలి.. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, సెప్టెంబర్ 23 (జనంసాక్షి):
గ్రామాలలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని అటవీ మరియు పోడు భూముల పరిష్కారంపై బీర్కూరు మండలం తిమ్మాపూర్ గ్రామ పరిధిలోని టీటీడీ కల్యాణ మండపంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల, అటవీ భూముల పరిష్కారానికి కృషి చేస్తుందని గ్రామాలలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా భవిష్యత్తులో అటవీ ప్రభుత్వ శాఖల మధ్య గొడవలు లేకుండా స్పష్టమైన సరిహద్దులను గుర్తించాలని ఆయన సూచించారు. అటవీ పోడు భూముల సమస్యలను పరిష్కరించి అర్హులకు న్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ అడవుల రక్షణకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2005లో నూతన అటవీ చట్టాన్ని రూపొందించి 2007 సంవత్సరంలో అటవీ చట్టం అమలు రావడం జరిగిందన్నారు. డిసెంబర్ 2005 కంటే ముందు కబ్జాలో ఉండి అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని చట్టంలో రూపొందించడం జరిగిందని, 2005 తర్వాత అడవులను నరికి కొత్త భూములను సాగు చేస్తే వారికి పట్టాలు రావన్నారు. కొంతమంది పైరవీ కారులు అమాయక రైతులను గిరిజనులు కొత్తగా చేసుకోవచ్చని మభ్యపెడుతున్నారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నరు. రెవిన్యూ అటవీ శాఖల భూముల మధ్య స్పష్టమైన విభజన జరిగేలా అధికారులు పనిచేయాలని, సమస్య పరిష్కారం కోసం 15 మందితో గ్రామ అడవి హక్కుల కమిటీ ఏర్పాటు చేసి గ్రామ కమిటీ సూచనలపై ఆర్డిఓ అధ్యక్షతన డివిజన్ కమిటీ నివేదిక ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీ పనిచేసి భూముల విభజనపై జిల్లా కలెక్టర్ దే తుది నిర్ణయం అన్నారు. బీర్కూరు మండలంలో అటవీ రెవెన్యూ శాఖల మధ్య అపరిశుద్ధంగా ఉన్న భూముల సమస్యలను పరిష్కరించి రాష్ట్రంలోనే మొదటిసారి నూతన పాస్ పుస్తకాలను ముగ్గురు రైతులకు ఆయన పంపిణీ చేశారు. అటవీ భూముల సమస్యను పరిష్కరించి రెవెన్యూ శాఖ ద్వారా రైతులకు పాస్ పుస్తకాలు అందించిన మొదటి గ్రామం నియోజకవర్గంలోని బీర్కూర్ గ్రామం అని, రాష్ట్రంలో మొదటిసారి ఇలా భూముల సమస్యలు పరిచరించడానికి ప్రయత్నం జరగడం బాన్సువాడ నుండి ప్రారంభించడం జరిగిందన్నారు. గిరిజన ఇతరులు అయితే 70 సంవత్సరాలు నుండి సాగులో ఉండి వారికి న్యాయం చేస్తామన్నారు. డిసెంబర్ నెల చివర్లోపు సమస్యలను పరిష్కరించి భూముల సరిహద్దులు తినే తర్వాత రెవెన్యూ భూములు అయితే ప్రభుత్వ పాస్ పుస్తకం, అటవీ భూములైతే ఆర్ఓఎఫ్ఆర్ పుస్తకం అందజేయడం జరుగుతుందని, తదుపరి హక్కుదారులకు పాస్ పుస్తకాల పంపిణీ చేసి రైతుబంధు రైతు బీమా పథకాలు వర్తింప చేస్తామన్నారు.పంటల ఉత్పత్తులు అమ్ముకోవడానికి పాసుబుక్ ఆధారంగా తీసుకుంటున్నారు కాబట్టి వారికి కూడా పరిష్కారం లభించినట్లు అవుతుందన్నారు. హక్కుదారులకు రూపాయి ఖర్చు లేకుండా భూముల సమస్యలు పరిష్కారం అవుతాయని, ప్రశాంతంగా పనిచేయడానికి పోలీస్ శాఖ సహాయ సహకారాలు అందించాలన్నారు. అడవుల నాశనంతో పర్యావరణం నాశనమవుతుందని ఒక ప్రాంతంలో అధిక వర్షాలు ఇంకో ప్రాంతంలో కరువు పరిస్థితులు ఉన్నాయని, భవిష్యత్ తరాల కోసం చెట్లను అటవీ ప్రాంతాలను కాపాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు జితేష్ వి పాటిల్, నారాయణరెడ్డి,ఆర్డీవో రాజా గౌడ్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా డిఎఫ్ఓ లు నికిత, వికాస్ మీనన్, జిల్లా ఎస్పి శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ, బోధన్ ఆర్డీవోలు రాజా గౌడ్, రాజేశ్వర్, బాన్సువాడ అటవీశాఖ అధికారి గంగాధర్, బీర్కుర్ ఎంపీపీ తిలకేశ్వరి రఘు, తెరాస నాయకుడు ద్రోణవల్లి సతీష్, మార్కెట్ కమిటీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, సంగ్రం నాయక్, నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.