పోడు రైతులకు చెక్కులు అందచేస్తున్నాం

ఆ ఘనత సిఎం కెసిఆర్‌దే: ఎమ్మెల్యే
కొత్తగూడెం,మే23(జ‌నం సాక్షి): రైతుబంధు పథకం పోడు రైతులకు వరంలా మారిందని ట్రైకార్‌ ఛైర్మన్‌, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు  అన్నారు. పోడు రైతులను ఆదుకోవడం లేదని విమర్శుల చేస్తున్న వారికి జిల్లాలో జరిగిన చెక్కుల పంపిణీయే సమాధానమని అన్నారు.  పోడు సాగు చేసుకునే గిరిజన రైతులకు రైతుబంధు పథకం వర్తించేలా సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకొని ఇందుకు సంబంధించిన నిధులను మంజూరు చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి  సాగు చేస్తున్న గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం మోక్షం కల్పించింది. రైతుబంధు పథకాన్ని పోడు రైతులకు వర్తింపజేస్తూ చెక్కులు పంపిణీ చేయడంతో గిరిజన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పోడు సాగు చేసుకుంటున్న గిరిజన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుందని సంబుర పడుతున్నారు. ఇక నుంచి పోడుభూముల్లో సాగు చేసుకునేందుకు చేయూత కలిగింది. ఖరీఫ్‌ సీజన్‌లో గిరిజన రైతులు పోడు భూముల్లో పంటలు వేయనున్నారు.జిల్లాలోని పోడు రైతుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసిన వ్యవసాయ అధికారులు గ్రామాల వారీగా పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. రైతుబంధు పథకం కింద పోడు భూము రైతులకు చెక్కుల రూపంలో పంపిణీ ప్రారంభమైంది. పోడుసాగుచేసే గిరిజన రైతులకు చెక్కులు ఇచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి వాటిని గ్రామాల వారీగా అందజేస్తున్నారు. జిల్లాలోమొత్తం56 గ్రామాలకు రూ.31.67 కోట్ల నిధులు మంజూరయ్యాయి. దీంతో తొలిరోజు 358 మంది రైతులకు రైతుబంధు చెక్కులను అందజేశారు. పోడురైతులకు రైతుబంధు పథకం చెక్కులు పంపిణీ ప్రారంభం కావడంతో గిరిజన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఐటీడీఏ పరిధిలో గిరిజన గ్రామాల్లో పోడు రైతుల జాబితాను సిద్ధం చేశారు.