పోలవరం నిర్మాణం.. తెలంగాణకు ఓ గండం
తెలంగాణను కాలవెట్టి సీమాంధ్రకు కాపడం పెట్టే తమ బుద్ధిని రాష్ట్ర పాలకులు మరోసారి వెల్లగక్కిన్రు. ప్రభుత్వం ఏ కార్యం మొదలు పెట్టినా, దాని లాభం సీమాంధ్రులకు, నష్టం తెలంగాణకు జరగడం పరిపాటిగా మారింది. కంపెనీలు పెట్టాలంటే, తెలంగాణ భూములు తీసుకుంటరు. ఆ కంపెనీల్లో ఉద్యోగాలు మాత్రం సీమాంధ్రులకు ఇస్తరు. ప్రాజెక్టులు కట్టాలన్నా తెలంగాణ భూముల్లో కడుతరు. నీళ్లు సీమాంధ్రకు మళ్లిస్తరు. నాటి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం నుంచి నేడు నిర్మించతలపెట్టిన పోలవరం వరకు, అప్పటి పాలకులు, ఇప్పటి పాలకులు అవలవబించిన విధానం ఒక్కటే. అదే తెలంగాణను ముంచడం. ఫలానా ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మొత్తుకున్నా పట్టించుకోరు. సీమాంధ్రకు లాభం చేకూరుతుందా లేదా అన్న దానిపైనే దృష్టి పెడుతరు. అదే ఓ ప్రాజెక్టుతో తెలంగాణకు లాభం జరిగి, సీమాంధ్రకు ఇసుమంత నష్టం జరుగుతుందన్నా, ఆ ప్రాజెక్టు నిర్మాణానికి ఏ మాత్రం ఒప్పుకోరు. దీనికి తెలంగాణలో నిలిచిపోయిన ఇచ్ఛంపల్లి, సీమాంధ్రుల కోసం నిర్మించాలని భావిస్తున్న పోలవరం ప్రాజెక్టులే సాక్ష్యం. భారత మొదటి ప్రధాని నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించబడ్డ నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలోనూ ఈ వివక్ష కొనసాగింది. ఈ ప్రాజెక్టును నందికొండ వద్ద నిర్మించాలన్నది మొదటి ప్రతిపాదన. ఈ ప్రతిపాదన అమలయ్యుంటే ఎన్నో తెలంగాణ గ్రామాలు ఆ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కనుమరుగయ్యేవి కావు. అంతో ఇంతో తెలంగాణకు కూడా నీళ్లు వచ్చేవి. కానీ, సీమాంధ్రులు దీనికి ఒప్పుకోకుండా ప్రస్తుతం ఉన్న చోట దాన్ని నిర్మించి, ఆ నీళ్లను యథేచ్ఛగా ఎత్తుకెళ్తున్నరు. సాగర్ ఉన్న నల్గొండ జిల్లా ప్రజలు మాత్రం గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్నరు. ఫ్లోరోసిస్ ఓ శాపంలా మారి దయనీయంగా బతుకులు వెల్లదీస్తున్నరు. ఇదంతా సీమాంధ్ర పాలకులకు పట్టదు. కృష్ణా డెల్టాకు నీళ్లు పట్టుకుపోవడమే వారి లక్ష్యం. నల్గొండలో ఫ్లోరోసిస్‌తో జనాలు జీవచ్ఛవాల్లా మారుతున్నా, గుక్కెడు మంచి నీళ్లు ఇద్దామన్న ఆలోచన కూడా సీమాంధ్ర పాలకులకు కలుగదు. రాష్ట్ర పాలకుల దృష్టిలో సీమాంధ్రులు మనుషులు.. తెలంగాణోళ్లు పురుగులు. ఇదే విషయాన్ని మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుదామనుకుంటున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో అంతర్భాగమైన ఖమ్మం జిల్లాలోని 350కి పైగా ఆదివాసీ గ్రామాలు అంతర్థానమై, ఆ అడవి బిడ్డల సంస్కృతి కనుమరుగై, వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని, పైగా పెద్ద ఎత్తున పర్యావరణ నష్టం జరుగుతుందని తెలంగాణవాదులు నెత్తీనోరు బాదుకుంటున్నా సీఎంకు చీమ కుట్టినట్లు కూడా లేదు. అందుకే, ప్రస్తుతం ఆంధ్రలో పర్యటిస్తున్న సీఎం పోలవరం ప్రాజెక్టును కట్టి తీరుతామని ప్రకటించేస్తున్నరు. పరోక్షంగా తాను సీమాంధ్ర సీఎంనని రుజువు చేసుకుంటూనే, తెలంగాణకు జరిగే నష్టాన్ని పట్టించుకోకుండా, ఏం చేస్తారో చేసుకోండి.. మేము మాత్రం పోలవరాన్ని కట్టే తీరుతామని ఇక్కడి ప్రజల మనోభావాలను కించపర్చేలా వ్యవహరిస్తున్నరు. కిరణ్ సాబ్ తీరు చూస్తుంటే ‘ఆంధ్రప్రదేశ్ ఛాతీ మీద తన్ని గుజరాత్‌కు గ్యాస్ తీసుకొచ్చిన’ అని గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు దగ్గర పోలిక ఉన్నట్లుంది. సీఎం పోలవరం ప్రాజెక్టు విషయంలో కనబరుస్తున్న అత్యుత్సాహంలో పైస మందమైనా తెలంగాణకు మేలు చేసే ఇచ్ఛంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో చూపడం లేదు. అదేమంటే అంతర్రాష్ట్ర, పర్యావరణ సమస్యలు కారణమని దాటేస్తున్నరు. మరీ ఇవే అంతర్రాష్ట్ర, పర్యావరణ సమస్యలు పోలవరం నిర్మాణంతో తలెత్తవా ? కచ్చితంగా ఉన్నాయి. కానీ, పోలవరం సీమాంధ్రులకు ‘వరం’ కదా ! అదే ఇచ్ఛంపల్లి తెలంగాణ కోసం కదా ! అందుకే, వివక్ష ! ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక్క ముఖ్య విషమేమిటంటే, ఇంకా కేంద్రం పోలవరం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీని కేసు ఇంకా సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. ఇవేమీ పట్టించుకోకుండా సీఎం తెలంగాణను ముంచే ఆ ప్రాజెక్టును కట్టి తీరుతామని ప్రకటిస్తూ ఇక్కడి ప్రజల మనస్సులను గాయపరుస్తూ, సీమాంధ్రులను సంతోష పెడుతున్నరు. పోలవరంపై మరీ ఇంత ప్రేమ ఒలకబోయడం పాలకులకు మంచిది కాదు. అయినా, తెలంగాణవాదులు పోలవరం నిర్మాణాన్ని ఆపమనడం లేదు. డిజైన్ మార్చి, నష్ట పోతున్న ఆదివాసుల కోసం చేపట్టే నష్ట నివారణ చర్యలను వెల్లడించాలని కోరుకుంటున్నరు. ఇది కూడా సాధ్యం కాదంటూ ఆదివాసీ గూడేలను ఈ ప్రాజెక్టుకు బలివ్వడం ఎంత వరకు న్యాయం ? ఆ వన మిత్రుల బతుకులను కాంక్రీట్ జంగల్లో వదలాలని అనుకోవడం ఎంత వరకు ప్రజాస్వామ్యబద్ధం ? అందుకే, ప్రభుత్వాలు పోలవరం నిర్మాణ విషయంలో తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని, ఆదివాసుల ఆవేదనను, దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. వారి ఆకాంక్షను గౌరవిస్తూ, ఆ ప్రాజెక్టు డిజైన్‌ను మార్చి నిర్మించాలి. దాని వల్ల నష్టపోయే వారికి పటిష్ట పరిహారాన్ని అందించాలి.