పోలవరం ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియలో అవకతవకలు – సోమిరెడ్డి ఆరోపణ
నెల్లూరు, జూలై 21 : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన శనివారం నాడు జరిగిన టెండర్ల ప్రక్రియలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కనుసన్ననలోనే భారీ అవకతవకలు జరిగాయని టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఏడాది సోమా, సిసిసిఎస్ అనే రెండు కంపెనీలు టెండర్లు కోడ్ చేయగా అందులో సోమా కంపెనీ మొదటి స్థానాన్ని, సిసిసిఎస్ రెండవ స్థానాన్ని దక్కించుకున్నాయని అన్నారు. గత ఏడాది పోలవరం కోసం సోమా కంపెనీ 4,147 కోట్లు, సిసిసిఎస్ కంపెనీ 4,122 కోట్ల రూపాయలు వేయగా టెండరును సిసిసిఎస్ దక్కించుకుంది. ఈ ఏడాది సిసిసిఎస్ కంపెనీ 4,450 కోట్ల రూపాయలు వేయగా, సోమా కంపెనీ 4,599 కోట్ల రూపాయలు వేసి మొదటి స్థానం దక్కించుకుందని అన్నారు. మిగత ఆరు కంపెనీలు టెండర్లు దాఖలు చేసినా వాటిని తెరవకుండానే సిసిసిఎస్‌కు ఇవ్వడం జరిగిందని దీనితో సిసిసిఎస్, సోమా కంపెనీలు సిండికేట్‌గా మారి టెండర్లు దక్కించుకున్నాయని అన్నారు. దీనితో ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అన్నారు. మిగత కంపెనీల టెండర్లు తరవకుండవున్నందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 10 శాతం ముడుపులు దక్కాయని చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అనుకుంటే, గత ఏడాది అతి తక్కువ కోడ్ చేసిన సోమా కంపెనీకి పనులు అప్పగించి నిజాయితీ నిరూపించుకోవాలని ఆయన అన్నారు. ఈ టెండర్ల వ్యవహారంలో ఒక పత్రికా ఎడిటర్ ప్రధాన పాత్ర పోషించారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు కె.వెంకటస్వామి నాయుడు, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.