పోలీసులకు సలాం
దిశను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి,ప్రాణాలతో ఉండగానే తగులబెట్టిన నలుగురు రాక్షసులు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. తొలిపొద్దు పొడవకముందే వారిజీవితాలు కూడా చీకట్లో కలిశాయి. దిశను చీకట్లోనే చిదిమేసిన వారిజీవితాలు కూడా చికట్లోనే తెల్లారాయి. ఈ మొత్తం ఘటనలో దిశ తల్లిదండ్రులకు కొంత ఊరట దక్కినా వారి కూతురు మాత్రం తిరిగి రాదని గుర్తుంచుకోవాలి. వారి కడుపుకోతను ఎవరూ తీర్చలేనిది. అర్థాంతరంగా మాయమైన తమ కూతురిని తల్చుకుని వారు జీవితాంతం ఏడుస్తూ ఉండాల్సిందే. నిర్భయ కేసు జరిగి ఏడేళ్లయినా నిందితులకు శిక్ష పడలేదు…ఉన్నావ్ అత్యాచారం కేసులో నిందితులు బెయిల్‌పై వచ్చి బాధితురాలు కోర్టుకు పోకుండా అడ్డుకుని తగులబెట్టే ప్రయత్నం చేశారు. దేశంలో ఇలాంటి ఘటనలు అనేకంగా ఉన్నాయి. బాధితులకు న్యాయం జరగలేదు. ఎందరో అమాయక అమ్మాయులు మృగాళ్లకు బలవుతున్నారు. అభశుభం తెలియని చిన్నారులు కూడా బలయ్యారు. వీరందరి కేసులో ఎవరికి కూడా న్యాయం జరగలేదు. ఈ దశలో ప్రజల్లో తీవ్ర ఆందోళనలు, ఆగ్రహాలు గూడుకట్టుకున్నాయి. మృగాళ్లను ఉరితీయాలి…ముక్కలుగా నరకాలి…పొడిచి పారేయాలి. అన్నంత కసి బయటపడింది. ఆ కసే ఇప్పుడు నిజమయ్యింది. దిశ హత్యాచార ఘటనకు కారకులైన వారు ఎన్‌కౌంటర్ కావడంతో నిజంగానే న్యాయం జరిగిందని ప్రజలు హర్షిస్తున్నారు. ఎందుకంటే కోర్టుల చుట్టూ తిరిగితే న్యాయం జరగదు. అందుకే సైబరాబాద్ పోలీస్ చర్యను సమర్థిస్తున్నారు. పోలీసులను అభినందిస్తున్నారు. వారికి స్వీట్లు తినిపిస్తున్నారు. బాణాసంచా కాల్చారు. పోలీసులను అభినందిస్తూ నినాదాలు చేస్తున్నారు. నరకాసుర వధ జరిగిందో లేదో కానీ ఇక్కడ అలాంటి వాతావరణం ప్రజల కళ్లకు కట్టింది. నరకాసురులు హతం అయ్యారన్న ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చట్టాలపై నమ్మకం కోల్పోతే ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. అలాంటి పరిస్థితులు రాకుండా …ఉన్న చట్టాల మేరకు నిందితులకు కఠిన శిక్షలు పడాలి. అలా జరిగివుంటే ఇలాంటి ఘటనలు జరగవు. అకృత్యాలు పునరావృతం కావు. ఇకపోతే ఈ ఎన్‌కౌంటర్ ద్వారా తాగి అకృత్యాలకు పాల్పడితే ఖతం కావాల్సిందే అన్న సందేశాన్ని పోలీసులు పంపారు. దిశ ఘటనతో దేశ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో ఈ ఎన్‌కౌంటర్‌తో పోలీసులు హీరోలు అయ్యారు. న్యాయస్థానాలు చేయలేని పనిని పోలీసులు చేశారన్న భావన ప్రజల్లో వ్యక్తం అవుతోంది. నిజానికి నిందితులను గుర్తించి పట్టుకున్నప్పుడే ప్రజలంతా ఆ కౄరులను తమకు అప్పగించాలని, తామే ఖతం చేస్తామని ఆందోళనకు దిగారు. షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌పైకి దాడికి దిగారు. నిజానికి పోలీసులు అలా నిందితులను వదిలివుంటే ఆరోజే వారు ఖతం అయ్యేవారు. ఇదంతా ప్రజల్ల గూడుకట్టుకుని ఉన్న ఆగ్రహానికి పరాకాష్టగా చూడాలి. నిజానికి షాద్‌నగర్ దగ్గర దిశ ఘటన చోటు చేసుకున్న తరవాత దేశ వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం,ఆందోళన వ్యక్తం అయ్యింది. సీన్ రీకన్‌స్టక్షన్ర్ చేస్తుండగా నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడం తో నలుగురు నిందితులు మృతి చెందారు. గత నెల 27వ తేదీన వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యాచారం చేసిన నిందితులు చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద దిశను పెట్రోల్ పోసి కాల్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ప్రదేశంలో పోలీసులు సీన్ రీకన్‌స్టక్షన్ర్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రదేశంలో చీకటిగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకున్న నిందితులు తమ బుద్దిని చూపించి పోలీసులపై దాడికి దిగారు. పారిపోయే యత్నం చేశారు. పోలీసులపై రాళ్లతోదాడికి యత్నించారు. ఈ దశలో వారిని పట్టుకునే క్రమంలో తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిందని సమాచారం. జైల్లో ఉన్నప్పుడు నిందితులను హై సెక్యూరిటీ మధ్య వేర్వేరుగా ఉంచారు. రాత్రి 12గంటల ప్రాంతంలో చర్లపల్లి జైలు నుంచి బయటకు తీసుకువచ్చారు. నిందితులను ఘటనకు పాల్పడిన ప్రాంతానికి తీసుకురాగానే దిశ సెల్ ఫోన్ గుర్తించేందుకు డీసీపీ సందీప్ రావు నేతృత్వంలోని బృందం అరగంటపాటు విచారణ జరిగిన అనంతరం నిందితులకు ముందు తెలిసిన ప్రాంతం కావడంతో వారి నేరబుద్ది చూపించారు. ఆరిఫ్ మొదట పోలీసులపై దాడి చేశాడు. అనంతరం మిగితా ముగ్గురు పోలీసులపై తిరగబడ్డారు. నిందితులు తుపాకులు లాక్కు నేందుకు ప్రయత్నించారు. అది వీలుకాకపోవడంతో రాళ్లదాడి చేస్తూ పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. పోలీస్ కమిషనర్ సజ్జనర్ ఘటనా స్థలానికి చేరుకుని ఎన్‌కౌంటర్ పై విచారణ చేపట్టారు. మొత్తంగా ఈ ఘటనతో మృగాళ్లకు భయం కలగడం ఖాయం. ఇలాంటి నేరాలు చేయాలంటే భయం కలగాలన్న రీతిలో పోలీసులు ముగింపు పలికారు. ఇకముందు అమ్మాయిలను ఒంటరిగా చూసినా తలదించుకుని వెళ్లేలా భయం కల్పించారు. సమాజం పెడదోవ పడుతున్న దశలో ఇలాంటి ఘటనలో తప్పవని గుర్తించాలి. దిశ హత్యాచార కేసుపై దేశవ్యాప్త ఆందోళనలు జరుగుతున్న వేళ .. ఇలాంటి ఘటనలు ఎక్కడా ఆగడం లేదు. వరుసబెట్టి అత్యాచారాలు.. హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజల దృష్టికి వచ్చే కొన్ని సంఘటనల పైనే ఆందోళనలు సాగు తున్నాయి. నిజానికి ప్రతి చిన్న సంఘటన పైనా పెద్ద ఎత్తున ఆందోళన సాగాలి. ఇలాంటి ఘటనలకు సంబంధించి పూర్తి న్యాయం జరగాలి. కఠిన శిక్షలకు పూనుకోవడం ఒక ఎత్తయితే త్వరగా శిక్షలు పడేలా కోర్టులు చూడాలి. ఇదే దశలో దేశంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, ఇంటర్నెట్ వినియోగం,అశ్లీల వీడియోల వల్ల చెడిపోతున్న యువతను సన్మార్గంలో పెట్టే యత్నాలు సాగాలి. దిశ హత్య కేసుకు ముగింపు పలికిన పోలీసుల చర్యను ఎవరైనా అభినందించాల్సిందే. ప్రజలు అభినందిస్తున్నారంటే కారణం న్యాయం జరిగిందని భావించడం వల్లనే అని గుర్తుంచుకోవాలి.