పోలీసులు పశువుల్లా ప్రవరిస్తున్నారు

వారి చర్యలతో దేశం సిగ్గుపడుతోంది
సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి):పోలీసుల తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు మృగాలుగా వ్యవహరిస్తున్నారని అభిశంసించింది. దేశం సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. నిరాయుధులైన మహిళలపై ఎందుకు చేయి చేసుకున్నారని     ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. స్త్రీలపై పోలీసు బలగాలను ఉసిగొల్పేమిటని నిలదీసింది. ఢిల్లీ, యూపీలలో మహిళలు చేయి చేసుకోవడంపై విూడియాలో వచ్చిన వార్తలను సుప్రీంకోర్టు సుమోటోగా కేసు విచారణకు స్వీకరించింది. మహిళలపై చేయి చేసుకున్న పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించింది. మహిళలపై పోలీసు బలగాలను ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందో చెప్పాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటనను నిరసిస్తూ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్నాయి. బాలికి చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద నిరసన చేస్తున్న ఓ యువతిపై ఏసీపీతో పాటు మరో పోలీసు దాడి చేశారు. ఆమె చెంప చెల్లుమనిపించారు. ఈ దృశ్యాలు విూడియాలో ప్రసారమయ్యాయి. మరోవైపు, యూపీ అలీగఢ్‌లోనూ మహిళల పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. ఆరెళ్ల చిన్నారి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేయలేదని పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. వారిపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దృశ్యాలు కూడా టీవీల్లో ప్రసారమయ్యాయి. ఈ రెండు ఘటనలు సుప్రీంకోర్టు సమోటోగా కేసు నమోదు చేసి, విచారణ చేపట్టింది.నిరసన చేస్తున్న యువతిపై ఢిల్లీ పోలీసులు ఎందుకు చేయి చేసుకున్నారో అఫిడవిట్‌ దాఖలు చేయాలని జస్టిస్‌ జీఎస్‌ సింఘ్వి నేతృత్వంలోని ధర్మాసనం ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. మరోవైపు, అలీగఢ్‌లో యూపీ పోలీసులు వ్యవహరించిన తీరుపైనా మండిపడింది. ’65 ఏళ్ల వృద్ధురాలని కూడా చూడకుండా డీఎస్పీ ఆమెను కిందకు నెట్టివేశారు. ఢిల్లీలో మరో ఉన్నతాధికారి చెవి నుంచి రక్తం కారేలా యువతి చెంప చెళ్లుమనిపించాడు. మహిళల పట్ల పోలీసుల ఆలోచనతీరు ఎటువంటిదో ఈ ఘటనలే స్పష్టం చేస్తున్నాయి’ అని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనలు దేశానికి సిగ్గుచేటని పేర్కొన్న ధర్మాసనం వీటిని నియంత్రించాల్సిందేనిన స్పష్టం చేసింది. ‘దేశంలో వేర్వేరు చోట్ల రోజూ పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే జంతువులు కూడా ఇలా ప్రవర్తించవనిపిస్తోందని’ అని అలీగఢ్‌ ఘటనను ప్రస్తావిస్తూ దుయ్యబట్టింది. ఈ ఘటన విూ ప్రభుత్వానికి సిగ్గుగా అనిపించడం లేదా? యూపీ సర్కారు తరఫున హాజరైన న్యాయవాది గౌరవ్‌ భాటియాను ప్రశ్నించింది. గతంలో రైలు ప్రమాదం జరిగిందని నైతిక బాధ్యత వహిస్తూ నాటి రైల్వే శాఖ మంత్రి లాల్‌బహదూర్‌ శాస్త్రి తప్పుకున్న ఉదంతాన్ని గుర్తు చేసిన ధర్మాసనం… ‘విూ బుద్ధి ఎటు పోయిందని’ ఘాటుగా ప్రశ్నించింది. నిరాయుధులైన మహిళలపై ఎన్నాళ్లు ఇలా పోలీసు అధికారులు దాడి చేస్తారని నిలదీసింది.