పోలీసు వ్యస్థను..

శ్రీకాకుళం , ఏప్రిల్‌ 16 (జనంసాక్షి) :
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను మార్చేస్థామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇది పెద్ద పనే అయినా తప్పదని అన్నారు. పేదలకు న్యాయం అందించే విషయంలో ఇంతకాలం పోలీసులు వ్యవహరిస్తున్న తీరులో మార్పు తెచ్చేందుకే తాము డయల్‌ 100 పథకాన్ని    ప్రారంభించడం జరిగిందని రాష్ట్రముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 185 రూపాయలకే తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను అందించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన అమ్మహస్తం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి, సంబందిత పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి టెక్కలిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ పేదలు నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెల్లే పరిస్థితులు లేవనే విషయాన్ని గుర్తించినందున పోలీసులనే బాదితుల ఇంటికి పంపించేందుకే డయల్‌ 100 పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని ఉగాది నుంచి ప్రారంభించామన్నారు. దీనికి ఎవరైనా బాధితులు ఫోన్‌ చేస్తే క్షణాల్లో పోలీసు సిబ్బంది చేరుతారని, అక్కడే దరఖాస్తు స్వీకరించడమేకాక, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కాపి ఇస్తారన్నారు. తర్వాత ఆన్‌లైన్‌లో పెడతారని, ప్రతికేసు రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల పనితీరుకు అద్దంపట్టేలా ఉంటుందన్నారు. హైదరాబాద్‌లోని డిజిపితో పాటు, ఇతర ఉన్నతాధికారులు ఒక్కో కేసును ఇట్టే చూసి పరిశీలించే అవకాశాలున్నాయన్నారు. న్యాయం కోసం పేదలు, బడుగు బలహీన వర్గాలు స్టేషన్‌లకు వెల్లే పరిస్థితులు లేవని, దీనిని గుర్తించే ఈపథకాన్ని ప్రారంభించామన్నరు. పోలీసుల్లో మార్పు తేవడం అనేది పెద్ద కష్టమైన పనే అయినా సాహసం చేసామన్నారు. ఎప్పటికైనా సమాజంతోపాటు ప్రతిఒక్కరు మారాల్సిందేనన్నారు. పోలీసుల్లో జవాబుదారీ తనం పెరుగుతుందన్నారు. పోలీస్‌ సేవలనేవి ఉన్నవారికో, పలుకుబడి ఉన్నవారికి పరిమితం కాకూడదనే ఉద్దేశ్యమే ప్రధానమైందన్నారు. దీనిని సద్వినియోగంచేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద సైతం ఆకలితో అలమటిస్తూ ఉపవాసం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే 9 రకాల నిత్యావసర వస్తువులను కలుపుకుని 185 రూపాయలకే ఇచ్చేందుకే అమ్మహస్తం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈపథకం ద్వారా నిరుపేద కుటుంబం నెలపాటు హాయిగా వండుకుని తినవచ్చన్నారు. అయితే నిరుపేదలకు ఉపయోగమైన సరుకులు మాత్రం ఇవ్వవద్దంటూ నడక మిత్రుడు చంద్రబాబు విమర్శలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. రెండు రూపాయల బియ్యం పథకాన్ని ఒక్క రూపాయికే ఇస్తున్నప్పుడు నిత్యావసర వస్తువులను సైతం తక్కువ ధరకే ఇస్తే బాగుంటుందని గుర్తించినందునే అమ్మహస్తం పేరుతో ఉగాది రోజున హైదరాబాద్‌లో ప్రారంభించినా  మంగళవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నామన్నారు. మారుమూలన ఉన్న శ్రీకాకుళం ఈశాన్యంలో ఉండడం వల్ల కాంగ్రెస్‌కు మంచిగా కలిసి వస్తుందనే ఉద్దేశ్యంతో ఈపథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు.  మంగళవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా కుగ్రామాల్లో సైతం రేషన్‌ సరుకులు అందుబాటులోకి వచ్చాయన్నారు. నడక మిత్రుడు మాత్రం విశాఖపట్నం నుంచే పాదయాత్రకు తిలోదకం ఇచ్చి ఇంటి ముఖం పడుతున్నాడని, నిరుపేదలుండే శ్రీకాకుళం జిల్లా ఆయనకు అవసరంలేదట అన్నారు. చంద్రబాబు చెపితే ప్రభుత్వం పథకాలు ప్రారంభించదని, పేదల గుండె చప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నారు. నిరుపేదలు ఆశిస్తున్నందునే 9రకాల నిత్యావసరాలను అదించే పథకాన్ని పేదలపాలిటి పెన్నిధి ఇందిరమ్మ పేరుతో అమ్మహస్తం నామకరణం చేశామన్నారు. ఆయనేమో వెన్నుపోటుతో అధికారంలోకి వచ్చి మామ ప్రారంభించిన రెండురూపాయల బియ్యం పథకాన్ని తుంగలో తొక్కారని, ఈవిషయం ప్రజలకు తెలియదనుకుంటున్నాడని విమర్శించారు. ఇందిరమ్మ కలలు పేరుతో ఎస్సీ, ఎస్టీల నిధులు సక్రమంగా వినియోగించే ఉద్దేశ్యంతో ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్‌ను ప్రారంభించి అమలుచేస్తున్నామన్నారు. అయితే తాను బిసిలకు ప్రతినిధినని చెప్పుకుంటున్న బాబు 9ఏళ్లలో కేవలం 138కోట్లు మాత్రమే వెచ్చిస్తే తాను ఈఒక్క ఏడే 27కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నామన్నారు. దీంతో బిసిలంటే ఎవరికి ప్రేమ ఉందో అర్థం చేసుకోవాలన్నారు. వచ్చే జూన్‌నెలలో స్థానిక సంస్థలు నిర్వహించబోతున్నామని, ఇందులో మహిళలకు యాభైశాతం సీట్లు రిజర్వేషన్‌ చేస్తున్నామని, మహిళలకు స్త్రీనిధిబ్యాంకును ఏర్పాటు చేయడమేకాక, వడ్డీలేని రుణాలిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అతితక్కువ మెజార్టీతో అధికారంలో ఉందని, ఇది శ్రీకాకుళం జిల్లావల్లే సాధ్యం అయిందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటినా ఒక్కనాడు కూడా ఉన్న అన్ని సీట్లు కాంగ్రెస్‌కు దక్కిన దాఖలాలు లేవన్నారు. ఈసారి పదింటిలో తొమ్మిదింటిని కాంగ్రెస్‌కు అప్పగించి ప్రబుత్వానికి అండగా నిలిచిందన్నారు. ఈవిషయాన్ని తాము మరిచిపోమని, అన్నిరంగాల్లో వెనుకబడి ఉన్నందున ప్రభుత్వం కూడా అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జిల్లాలో ప్రధాన వంశధార ప్రాజెక్టు ప్రధాన కెనాల్‌ ఆధునీకరణ చేస్తామన్నారు. టెక్కలికి అవసరమైన అంబేద్కర్‌ భవన్‌ నిర్మాణానికి 35లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. టెక్కలిలో త్వరలోనే మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుచేస్తామని, అలాగే వెటర్నరీ కళాశాల గురించి కూడా యూనివర్శిటి అధికారులతో విచారణ చేయించాక నెలకొల్పుతామన్నారు.ఈ కార్యక్రమంలో సిఎంతో పాటు బొత్స సత్యనారాయణ, శ్రీధర్‌బాబు, శత్రుచర్ల విజయరామారాజు, ధర్మానప్రసాద్‌రావు,  కొండ్రు మురళి, కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, ఎమ్మెల్యేలు నీలకంఠం, ప్రసాద్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు టెక్కలిలో నిర్మించనున్న ఎన్‌ఐఐటి భవనానికి శంకుస్థాపన చేశారు.