ప్యాకేజీలు, పొట్లాలంటే రాష్ట్ర అగ్నిగుండమే

తస్మాత్‌ జాగ్రత్త
నిప్పులు చెరిగిన హరీశ్‌
హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి) :
తెలంగాణకు ప్యాకేజీలు, పొట్లాలంటే రాష్ట్రం అన్నిగుండమే అవుతుందని ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీపై హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకుండా ప్యాకేజీ అంటే తెలంగాణ యావత్తు భగ్గుమంటుందని హెచ్చరించారు. ప్యాకేజీ ఇస్తామని ప్రకటిస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని, అప్పుడు జరిగబోయే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు. గురువారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. తమ ఉద్యమం ప్యాకేజీల కోసం కాదని.. ప్రత్యేక రాష్ట్రం కోసమని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటు మినహా మరే ప్రత్యామ్నయాన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్యాకేజీ ఇవ్వడమంటే ఎక్స్‌పైరీ అయిన మందును ఇవ్వడమేనని అభివర్ణించారు. గడువు ముగిసిన మందును ఇస్తే ఇన్ఫెక్షన్‌ వచ్చినట్లు.. ప్యాకేజీ ఇస్తే కాంగ్రెస్‌కూ ఇన్ఫెక్షన్‌ వస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకుండా ప్యాకేజీ ఇస్తే తెలంగాన ప్రజలు కాంగ్రెస్‌ను ప్యాక్‌ చేసి తెలంగాణ నుంచి గెంటివేస్తారని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటే అన్ని సమస్యలకు పరిష్కారమన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్టాన్న్రి వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.
బాబుకు దమ్ముంటే విచారణకు రావాలి
టీఆర్‌ఎస్‌పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలపై హరీశ్‌ తీవ్రంగా మండిపడ్డారు. అసత్య ప్రచారాలతో టీడీపీ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని, ప్రతి రోజూ అబద్దాలు చెప్పి పబ్బం గడుపుకోలేమని తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ కోసం తాము మడమతిప్పని పోరాటం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని, టీఆర్‌ఎస్‌ను కించపరిచేలా మాట్లాడితే ప్రజలే వారికి గుణపాఠం చెబుతారన్నారు. కేసీఆర్‌ను విమర్శించే స్థాయి చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. రెండెకరాల భూమి ఉన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టిన చంద్రబాబుకు రెండు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ 200 ఎకరాల భూమున్న కుటుంబం నుంచి వచ్చారని తెలిపారు. అలాంటి కేసీఆర్‌ను విమర్శించే స్థాయి బాబుకు లేదన్నారు. చంద్రబాబు తన ఆస్తులపై విచారణకు సిద్ధపడితే.. కేసీఆర్‌ కుటుంబం కూడా విచారణకు సిద్ధంగా ఉందని తెలిపారు. దమ్ముంటే చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు. బాబు జమానా`అవినీతి ఖజానా అని వామపక్ష పార్టీలు బాబును దుమ్మెత్తిపోశాయని గుర్తు చేసిన హరీశ్‌… ఇప్పుడు అవే పార్టీలతో పొత్తు పెట్టుకొనేందుకు బాబు సిద్ధపడుతున్నాడని ధ్వజమెత్తారు. వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరని, వెన్నుపోటు పొడవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. పదవి కోసం పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన ఘన చరిత్ర ఆయనదని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు కమ్మక్కయ్యారని హరీశ్‌ ఆరోపించారు. అధికార పార్టీకి టీడీపీ తోక పార్టీగా మారిందన్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై కిరణ్‌ సర్కారును కంటికి రెప్పలా కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంతో కుమ్మక్కైనుందకే బాబుపై ఎలాంటి కేసులు పెట్టడం లేదన్నారు. విూడియాను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబుది అందె వేసిన చేయి అని.. కానీ విూడియాను మేనేజ్‌ చేసినంతగా ఆయన ప్రజలను మేనేజ్‌ చేయలేరన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని టీడీపీకి టీఆర్‌ఎస్‌ నేతలను తెట్టే హక్కుందా? అని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఏనాడైనా ఉద్యమం చేశారా? ఎప్పుడైనా రాస్తారోకో, రైలురోకో.. కనీసం నిరసన ప్రదర్శనైనా చేశారా? అని ప్రశ్నించారు.