ప్యాకేజీ అంటే భిక్షం

సర్కారు మాట తప్పితే మాహా ఉద్యమం : కోదండరామ్‌
హైదరాబాద్‌, జూన్‌ 23 (జనంసాక్షి) :
తెలంగాణకు ప్యాకేజీ అంటే భిక్షంతో సమానమని, ప్రత్యేక రాష్ట్రం కాకుండా ప్యాకేజీ ప్రకటిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హెచ్చరించారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రేశఖర్‌రావుతో కోదండరామ్‌ సహా జేఏసీ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంపై నేతలు చర్చించామని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు రూపొందించాల్సిన కార్యాచరణపై నేతలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రం చేసేందుకు జేఏసీి స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై ఆయన మండిపడ్డారు. ఎలాంటి ప్యాకేజీలకు అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తమ ముఖ్య లక్ష్యమని అన్నారు. ప్యాకేజీలంటే భిక్షం అడిగినంత సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రానికి తెలంగాణ ఇవ్వడమే తప్ప మరో ప్రత్యామ్నాయం ఏదీ లేదని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీల పేరుతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోక తప్పదని కోదండరామ్‌ హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు డబ్బులకు లొంగేవారు కాదని అన్నారు. తమ ఆత్మాభిమానాన్ని, ఆకాంక్షను నెరవేర్చుకునేందుకే తెలంగాణ ప్రజలు ఉద్యమం చేపట్టారని ఆయన మరోమారు గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని, నాన్చుడి ధోరణిని విడనాడాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తారక రామారావుపై వస్తున్న ఆరోపణలపై తెలంగాణ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో చర్చిస్తామని అన్నారు. తెలంగాణ రాకుండా అడ్డుపడుతున్న కాంగ్రెస్‌, టీడీపీ, వైఎస్సార్‌ సీపీలను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కోదండరామ్‌ హెచ్చరించారు. పది జిల్లాల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ సాధన కోసం పాటు పడతామని తెలిపారు.