ప్రజల గుండె చప్పుడు మాకు తెలుసు

పేదల అభివృద్ధే మా లక్ష్యం : సీఎం కిరణ్‌
చిత్తూరు, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి) :
పేదప్రజల గుండె చప్పుడు తెలిసిన ప్రభుత్వం తమదని.. వారి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులు అందించాలన్న లక్ష్యంతో ‘అమ్మహస్తం’ పథకాన్ని తీసుకువచ్చామని వెల్లడించారు. వెనకబడిన ఎస్సీ, ఎస్టీల కోసం సబ్‌ప్లాన్‌ చట్టాన్ని తీసుకువచ్చామని.. దేశంలో ఈ చట్టం తీసుకు వచ్చిన మొదటి రాష్ట్రం మనదేనన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ఒక్క  ఈ ఏడాదే రూ.12 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లాలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బుధవారం చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో అమ్మహస్తం పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం స్త్రీ శక్తి భవనాలను కూడా ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. తన సొంత నియోజకవర్గం పీలేరు మాదిరే తంబళ్లపల్లి నియోజకవర్గంలోనూ సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని హావిూఇచ్చారు. అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.తాను ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని… మహిళలకు, రైతులకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వలేని స్థితిలో, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. మరోవైపు, తెలంగాణ ఉద్యమం, ఇంకోవైపు, కాంగ్రెస్‌ పార్టీలో సంక్షోభం సృష్టించేందుకు కొందరు యత్నిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రినయ్యానని.. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామన్నారు. ఉద్యమ సమయాల్లోనూ చదువులకు ఆటంకం కలగకుండా చూశామని.. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించక తప్పడం లేదన్నారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

‘అమ్మహస్తం’తో పేదలకు ఆసరా..

పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతో రూపాయికే కిలోబియ్యం పథకం ప్రారంభించామన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని 2.25 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. అయితే, ఇతర సరుకుల ధర పెరిగిపోయిందని.. వంట సామాగ్రి కూడా ఇస్తే బాగుంటుందని మహిళలు కోరిన నేపథ్యంలో.. వంట వస్తువులు ఏమేవిూ అవసరమో వాటిని తక్కువ ధరకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగానే అమ్మహస్తం పథకం తీసుకొచ్చామని.. రూ.185కే తొమ్మిది రకాల వస్తువులు అందిస్తున్నామన్నారు. కానీ, కొందరు ఓర్వలేని వారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, అమ్మహస్తం పథకాన్ని మొండిహస్తమని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. అమ్మహస్తం వద్దని చంద్రబాబు చెబుతున్నాడని.. ప్రజలేమో కావాలంటున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం పేదవారి గుండెచప్పుడు తెలిసినదని, వారి కోసం పాటు పడుతుందన్నారు. పేదలపై కరెంట్‌ చార్జీల భారం మోపలేదని.. అయినా విపక్షాలు, విూడియా మిత్రులు రాద్దాంతం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 1.80 కోట్ల మంది 50 యూనిట్ల కంటే తక్కువ కరెంట్‌ వాడుకుంటారని, వారిపై ఎలాంటి చార్జీల భారం పడకుండా చూశామన్నారు. 50 యూనిట్లలోపు వాడే వారు యూనిట్‌కు రూ.1.40 కడితే.. ప్రభుత్వం తరఫున రూ.3.80 కడుతున్నామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నివసిస్తున్న వారు 50 యూనిట్ల లోపు వాడుకుంటే.. ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే సోలార్‌ పవర్‌ విధానం తీసుకురానున్నామన్నారు.

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక కృషి..

వెనుకబడిన ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చెప్పారు. ‘ఇందిరమ్మ కలలు’ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ఎంతగానో లబ్ధి చేకూరుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను వారికే ఖర్చు చేయాలనే లక్ష్యంతో… వారికి చదువులో, ఉద్యోగాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో అవకాశలు లభించేందుకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ తీసుకువచ్చామన్నారు. 1975-76లో ఇందిరాగాంధీ ఏవైతే కలలు కన్నారో .. వాటిని తాము చట్ట రూపంలో తీసుకువచ్చామని తెలిపారు. సబ్‌ప్లాన్‌ వల్ల ఈ ఏడాది రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉందన్నారు. ఎస్సీలకు రూ8,585 కోట్లు, ఎస్టీలకు రూ.3,666 కోట్లు కేటాయించి, వారి కోసం ఖర్చు చేస్తున్నామని వివరించారు. బీసీలు, మైనార్టీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

చంద్రబాబుపై ధ్వజం..

టీడీపీ అధినేత చంద్రబాబు కిరణ్‌ ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లాకు చెందిన బాబు తొమ్మిదేళ్లలో సొంత జిల్లాకు దమ్మిడి పని కూడా చేయలేదని విమర్శించారు. బీసీలకు తానే ఎక్కువ చేశానని చెప్పుకునే టీడీపీ అధినేత.. తొమ్మిదేళ్లలో కేవలం రూ.1850 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడన్నారు. అంటే, ఏడాదికి రూ.150 కోట్లు ఖర్చు మాత్రమే ఖర్చే చేశారని.. కానీ, తాము ఈ ఒక్క సంవత్సరంలోనే రూ.4,027 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. బీసీలను అభివృద్ధి చేస్తున్న ఘనత తమదేనన్నారు. అలాగే, మైనార్టీల అభివృద్ధికి కూడా కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో, 2004లో మైనార్టీల అభివృద్ధి కోసం రూ.36 కోట్లు ఖర్చు చేస్తే… తాము ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.1027 కోట్లు వెచ్చించామని వివరించారు.

మహిళలకు బాసటగా ఉంటాం..

మహిళా సాధికారత కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం అన్నారు. వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని.. ఒక్క రూపాయి కూడా పూచీకత్తు తీసుకోకుండా రుణాలు ఇస్తున్నామన్నారు. దేశంలో రూ.25 వేల కోట్ల రుణాలు ఇస్తుంటే.. అందులో మన రాష్ట్ర మహిళలే రూ.13 వేల కోట్ల రుణాలు తీసుకున్నారన్నారు. అసలు చెల్లిస్తే వడ్డీ పూర్తిగా ప్రభుత్వం చెల్లిస్తుందని తాము నిర్ణయం తీసుకోవడం వల్లే పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటున్నారన్నారు. అలాగే, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరిటే ఇస్తున్నామని.. డబ్బు ఇతరత్రా వృథా చేయరనే ఉద్దేశంతో వారి పేరిటే ఇళ్లు కేటాయిస్తున్నామన్నారు. రాబోయే స్థానిక సంస్థల్లో ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పిస్తున్నామని వివరించారు.

చిత్తూరు జిల్లాకు వరాలు

చిత్తూరు జిల్లాపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించారు. కరువు ప్రాంతమైన మన జిల్లాలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందన్నారు. జిల్లాలో తాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి రూ.7,390 కోట్లు కేటాయించామని, త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. రూ.7 వేల కోట్లతో చేపట్టనున్న కండలేరు ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు యత్నిస్తామన్నారు. కందుకూరు చెరువు కోసం రూ.54 కోట్లు మంజూరు చేసిన సీఎం.. త్వరలోనే టెండర్లు పిలుస్తామని చెప్పారు. అలాగే, బి.కొత్తకోటలో డిపో ఏర్పాటుకు స్థలం కేటాయించడంతో పాటు బస్టాండ్‌ నిర్మాణానికి రూ.కోటి మంజూరుచేశారు. రూ.5 కోట్లతో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.