ప్రజల భాగస్వామ్యంతో హరితహారం

ఖమ్మం,మే24(జ‌నం సాక్షి): అన్ని శాఖల సమన్వయంతోనే హరితహారం కార్యక్రమం విజయవంతం అవుతుందని ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా అటవీ అధికారి అన్నారు. జూన్‌లో చేపట్టే హరితహారం కార్యక్రమం కోసం నర్సరీల్లో అవసరమైన మొక్కలను సిద్ధం చేసి ఉంచడం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పిలపునిచ్చారు. అన్ని శాఖల అధికారులతో హరితహారంపై సమావేశాన్ని ఏర్పాటు చేసి సవిూక్షించి ముందుకు సాగుతామని అన్నారు.  ప్రజల కోరిక మేరకు పలు నర్సరీల్లో పండ్ల, పూల మొక్కలను సైతం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. నాటిన ప్రతి మొక్క మాను అయ్యే విధంగా కార్యాచరణ చేసుకొని సిద్ధం కావాలని ఆయన అధికారులకు సూచించారు. వచ్చే హరితహారంలో మొక్కలను పెంచి ప్రజలు తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు.గ్రామ పంచాయతీకి 40వేల మొక్కల చొప్పున 17గ్రామ పంచాయతీల పరిధిలో 6.80లక్షల మొక్కలు నాటేలా జిల్లా కలెక్టర్‌ ఆదేశించడం జరిగిందన్నారు. ఈ మేరకు లక్ష్యాన్ని అధిగమించేందుకు సన్నద్ధం కావాల్సి ఉందన్నారు.చేయి చేయి కలిపి హరితహారం విజయాన్ని జిల్లాకే ఆదర్శంగా మార్చుకుందామన్నారు.