ప్రజారోగ్యం గాలికి.. నాణ్యత పాటించని ఫుడ్ సెంటర్లు

– కాసులు దండుకుంటున్న హోటల్స్
– కానరాని ఫుడ్ సేఫ్టీ అధికారులు

డోర్నకల్ ఆగస్టు 30 జనం సాక్షి

నియోజకవర్గ కేంద్రంలో టిఫిన్ సెంటర్లు,హోటళ్లు కాసులో వేటలో నిమగమై ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారాలు చేస్తున్నారు.నిత్యం వివిధ పనుల నిమిత్తం ప్రజలు మండల కేంద్రానికి వస్తూ ఉంటారు.స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు హోటళ్లపై ఆధారపడుతున్నారు.
అయితే ఇదే అదునుగా చేసుకున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు,హోటళ్లు భోజన తయారీలో నాణ్యత పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.పట్టణంలో బిర్యానీకి మంచి గిరాకీ ఉంది.ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా బిర్యానీని టేస్ట్‌ చేయాలని అనుకుంటారు.ముఖ్యంగా భోజన ప్రియులైతే వారంలో రెండు నుంచి మూడు సార్లు బిర్యానీని రుచిచూడటమే కాకుండా,తన మిత్రులకు కూడా ఆ రుచిని పరిచయం చేస్తున్నారు.ఆహార తయారీలో నాణ్యత పాటించడం లేదు.రోజువారీగా హోటళ్ళల్లో టిఫిన్లు,బోజనాలు చేసేందుకు వందల సంఖ్యలో కస్టమర్లు విచ్చేస్తుంటారు.అలాంటి వారి ఆరోగ్యాలకు హానికల్గించేలా కొన్ని టీ,టిఫిన్,భోజనం హోటల్లు సుచీ శుభ్రత పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.అలాంటి వాటిలో సాధారణ మధ్యతరగతికి చెందిన ప్రజలు ఎక్కువగా వెళ్తుంటారు.అయితే కస్టమర్లు కూర్చునే బెంజీల నుంచి తినే ప్లేట్స్‌ వరకు శుభ్రత పాటించకుండా అందులోనే ఆహారాన్ని వడ్డిస్తున్నారు.భోజన ప్రియులు పని ఒత్తిడిలో భాగంగా తాము ఎలాంటి భోజనం తీసుకుంటున్నాం అది శుభ్రంగా లేదా అనేది పట్టించుకోకుండా తినేసి వారి పని వారు చేసుకుంటున్నారు.హోటళ్ల దందాపై ఎవరూ ప్రశ్నించకపోవడంతో వారు అదే అదునుగా రెచ్చిపోతున్నారు.రుచి లేకుండా భోజనాలు పెడుతూ కస్టమర్ల నుంచి డబ్బులు దండుకుంటున్నారు.

అధికారుల పరివేక్షణ కరువు..

ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ కరువై వ్యాపారులు,హోటల్ యాజమాన్యాలు ప్రజల ఆరోగ్యాలతో చెలాగాటమాడుతున్నారనే విమర్శలువెల్లువెత్తుతున్నాయి.అధికారులు నిరంతరం ఫుడ్‌ సెంటర్లపై నిఘా పెడితే ప్రజా ఆరోగ్యాలను కాపాడిన వారవుతారని స్థానికులు తెలిపారు.పట్టణ కేంద్రంలో అన్ని కలిపి దాదాపు రెండంకెల హోటళ్లు ఉండగా అందులో కొన్ని హోటల్స్‌ ఎలాంటి నిబంధనలు పాటించకుండా వ్యాపారాలు నడుపుతున్నారని సమాచారం.హోటల్‌ యజమానులు కస్టమర్ల నుంచి వచ్చే డబ్బులే చూస్తున్నారు తప్ప వారికి నాణ్యమైనా ఆహారం అందించాలని వారికి లేదని అందులోని వసతులు చూస్తే తెలుస్తోంది.ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వీరి బిజినేస్‌ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతోందని చెప్పుకోవాలి.ఇదిలా ఉంటే కొంతమంది కల్తీ ఆహారం తీసుకుని అనారోగ్యం బారిన పడి ఆస్పత్రులల్లో చేరుతున్నారు.హోటల్లో నాసీరకమైన ఆయిల్స్‌ వాడుతున్నట్టు సమాచారం.ఇది తిన్నవారికీ కడుపునొప్పి గ్యాస్‌ట్రబుల్‌ తిన్న ఆహారం డైజేషన్‌ కాకపోవడంతో భోజనానికి దూరంగా ఉంటున్నారని వైద్యులు తెలుపుతున్నారు.
ఇప్పటికైనా ఫుడ్ డిపార్ట్మెంట్,మున్సిపల్ అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నడిపే హోటళ్లపై చర్యలు తీసుకుని,ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు.