ప్రజా గోస – బిజెపి భరోసా యాత్రను విజయవంతం చేద్దాం
ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణానికి బాటలు వేద్దాం
* బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
మానకొండూరు నియోజకవర్గం పరిధిలో శుక్రవారం నుండి జరగబోయే ప్రజా గోస – బిజెపి భరోసా యాత్రను విజయవంతం చేయడానికి, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణానికి బాటలు వేయడానికి నియోజకవర్గ పరిధిలోని బిజెపి శ్రేణులందరూ కదిలి రావాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మానకొండూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ప్రజా గోస – బిజెపి భరోసా యాత్ర సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైనఆయన మాట్లాడుతూ మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణ, టిఆర్ఎస్ కుటుంబ పాలన చేతిలోకి వెళ్లి అప్పుల తెలంగాణగా మారిన దయనీయ పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని, కెసిఆర్ కుటుంబస్వామ్యం గా మారి, బంగారు తెలంగాణ కలగానే మిగిలిపోయిందన్నారు. కుటుంబ పాలనా చేతిలో బంద్ అయిన తెలంగాణ తల్లి విముక్తి కొరకు, ప్రజాస్వామ్య తెలంగాణ కొరకు బిజెపి ఎనలేని పోరాటం చేస్తుందని, అందులో భాగంగా చేపట్టిన ప్రజా గోస- బిజెపి భరోసా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బిజెపి శ్రేణులు అందరూ కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఉద్యోగులను, ప్రజానీకాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని , ఉద్యోగ ప్రజా వ్యతిరేక కెసిఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణను తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజా వ్యతిరేక టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి , ప్రజా క్షేత్రంలో కెసిఆర్ ప్రభుత్వ వ్యవహార శైలిని ఎండగట్టడానికి బిజెపి తగిన కార్యాచరణతో ముందుకు పోతుందన్నారు. బిజెపి ప్రధాని మోడీ సారథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో డబల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణలో బిజెపి అడుగులు వేస్తుందని చెప్పారు. శుక్రవారం రోజున మానకొండూర్ మండలంలోని పలు గ్రామాల్లో జరగబోయే ప్రజా గోస- బిజెపి భరోసా కార్యక్రమానికి బిజెపి నేత మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఈ సమావేశంలో , బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,బిజెపి నాయకులు ఓరెం జయచందర్, మహిపాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, మాడ వెంకట్రెడ్డి, జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి, జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణ్ చంద్ర, అలివేలు సమ్మిరెడ్డి, జిల్లా ఆఫీస్ సెక్రటరీ మాడుగుల ప్రవీణ్, మీడియా సెల్ కన్వీనర్ కటకం లోకేష్, ముత్యాల జగన్ రెడ్డి, మానకొండూర్ మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.