ప్రజా సమస్యలపై ‘ఆమ్‌ఆద్మీ’ ఆందోళన

ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం : కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) :
ప్రజా సమస్యలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఆదివారం విద్యుత్‌ చార్జీలు, తాగునీటి కుళాయిల బిల్లులు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ జంతర్‌ మంతర్‌ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఢిల్లీ సర్కారుకు ప్రజాసంక్షేమం పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదుపు లేకుండా పెరుగుతున్న ద్రవ్యో ల్బణంతో సామాన్యులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని, మధ్య   తరగతి ప్రజలు సైతం సామాన్య జీవనం గడపలేని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై స్పందించాలని తమ పార్టీ వాలంటీర్లు ఢిల్లీ సీఎం షీలాదీక్షిత్‌ను కలిస్తే ఆమె నుంచి స్పష్టమైన హామీ దక్కలేదన్నారు. ఇలాంటి పాలకులకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. ప్రజాసంక్షేమాన్ని మరిచి, సమస్యలను కానుకగా ఇచ్చిన సర్కారేది మనలేదని స్పష్టం చేశారు. ప్రజలను పస్తులుంచుతున్న ఢిల్లీ సర్కారు దానికి త్వరలోనే ఫలితాన్ని అనుభవించి తీరుతుందని అన్నారు. ఢిల్లీ సర్కారు దిగివచ్చే వరకూ తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. కాగా కేజ్రీవాల్‌ ఇవే డిమాండ్లతో ఇదే నెలలో రెండు వారాలు నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే.