ప్రతిఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి-జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్
వనపర్తి బ్యూరో నవంబర్ 13 (జనంసాక్షి)
నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ పిలుపునిచ్చారు. స్వీప్ యాక్టివిటీ -2023 లో భాగంగా సోమవారం ఉదయం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో “నేను తప్పనిసరిగా ఓటు వేస్తాను” అనే గోడ పత్రికను ఆవిష్కరించారు. అదేవిధంగా ఓటర్ గైడ్ అనే చిన్న పుస్తకాన్ని సైతం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గానికి నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ప్రతి ఒక ఓటరు తన ఓటును తప్పనిసరిగా వేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం మాత్రమే నిలబడిందని, ప్రజాస్వామ్యం నిలబడాలంటే ప్రతి ఓటరు తన ఓటును తప్పనిసరిగా వేయాలని అదేవిధంగా ఎలాంటి ప్రలోభాలకు ఆశపడకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవాలని సూచించారు. ఓటరు తన ఓటును ఈ.వి.యం ద్వారా ఏ విధంగా ఓటు వేయాలి, ఏమైనా సమస్యలు ఉంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి ఎలా ఫిర్యాదు చేయాలి అనే కరదీపికను సైతం కలెక్టర్ తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. గొడపత్రికను, కరదీపిక ను వనపర్తి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించే విధంగా పంచటం జరుగుతుందని తెలియజేశారు.
స్వీప్ నోడల్ అధికారి రామ మహేశ్వర రెడ్డి, యం.సి.యం.సి. నోడల్ అధికారి పి. సీతారామ్, డి.టి. ఒ వెంకటేశ్వర్లు , సివిల్ సప్లై అధికారి కొండల్ రావు, సి.సెక్షన్ పర్యవేక్షకులు రమేష్ రెడ్డి, ఈ.డి.యం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.