ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

గరిడేపల్లి, ఆగస్టు 29 (జనం సాక్షి):ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దానిలో భాగంగానే సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలోని ఎంబీఆర్ ఫంక్షన్ హాల్ లో సోమవారం ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా పింఛన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరి ముఖాలలో వెలుగులు చూడడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ప్రస్తుతం ఏ ఇంటి తలుపు తట్టిన తప్పక ఏదో ఒక ప్రభుత్వ సంక్షేమ పథకం అందుతుందనే  సమాధానం వినిపిస్తుందన్నారు. సొంత అన్నదమ్ములైనప్పటికీ  సమస్యలు వస్తే అండగా నిలబడని ఈ రోజుల్లో  కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు అందచేయుచున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ దేనన్నారు. వృద్ధులు పడుతున్నబాధలు  చూసి వారికి పింఛను అందించే వయసును 57 సంవత్సరాలకు తగ్గించిన ఘనత ఆయనదేనన్నారు . ప్రజల అవసరాలు ఏమిటో సీఎం కేసీఆర్ కి తెలుసునని,దానికి అనుగుణంగానే ఆయన పాలన సాగిస్తున్నారని అన్నారు. స్వప్రయోజనాల కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతూ మనసుల మధ్య గొడవలు సృష్టించాలనుకునే  పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీల వెంకట రమణారెడ్డి, ఇంచార్జి ఎంపీడీవో కే వనజ, వివిధ గ్రామాల సర్పంచులు కీత జ్యోతి రామారావు, పేరబోయిన మల్లేశ్వరి వెంకటేశ్వర్లు,గాలి రామకృష్ణ, టీ సీతరాంరెడ్డి , సిహెచ్ కాశయ్య , కర్నాటి నాగిరెడ్డి, ఎంపీటీసీలు కడియం స్వప్న వెంకటరెడ్డి, మేకల స్రవంతి శోభన్ బాబు, కడప ఇషాక్, మేళ్లచెరువు వెంకటరమణ, పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు ఆసరా పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.