ప్రతి ఉద్యోగ ఖాళీని భర్తీచేస్తాం

Untitled-1

ఐదేళ్ల వయోపరిమితి సడలిస్తాం

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్‌ చేస్తాం

ప్రయివేటు రంగంలోనూ ఉద్యోగ, ఉపాధి కల్పన

సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 24 (జనంసాక్షి) : ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీచేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ఐదేళ్ళ వయోపరిమితిని సడలిస్తామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్‌ చేస్తామని పునరుద్ఘాటించారు. ప్రయివేటు రంగంలోనూ ఉద్యోగ, ఉపాధి కల్పనకు చర్యలు చేపడుతామని తెలిపారు. త్వరలోనే ఉద్యోగ నియామకాలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగుల పంపకాలు పూర్తయిన తర్వాత ఖాళీలపై స్పష్టత వస్తుందని, ఆ వెంటనే నూటికి నూరు శాతం ఖాళీల భర్తీ చేపడతామని వెల్లడించింది. నిరుద్యోగులకు ఐదేళ్ల వయో పరిమితి ఇచ్చి నియామకాలు చేపడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఒక్క ఖాళీ కూడా ఉంచకుండా నియమాకాలు చేపడతామని చెప్పారు. అలాగే, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే సీఎస్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేశామని, నివేదిక రాగానే క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు. రాజ్యాంగ నిబంధనలు, రిజర్వేషన్ల మేరకు క్రమబద్ధీకరణ ఉంటుందని తెలిపారు. సోమవారం శాసనసభలో నిరుద్యోగ సమస్యపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ఉద్యోగాల కల్పన, క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందని సీఎం అన్నారు. ఒక రాష్ట్రం తన గమ్యాన్ని నిర్దేశించుకొనే సమయంలో ఉద్యోగుల పాత్ర కీలకమని చెప్పారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఖాళీలను వంద శాతం భర్తీ చేస్తామని హావిూ ఇచ్చారు. ప్రభుత్వంలో ఒక్క ఖాళీ లేకుండా అన్నింటికీ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు.

గత పాలకుల పాపమే

నిరుద్యోగ సమస్యకు కారణమెవరో అందరికీ తెలుసేనని కేసీఆర్‌ అన్నారు. ఇప్పటికిప్పుడు నిరుద్యోగ సమస్య వచ్చినటలు మాట్లాడడం సరికాదన్నారు. ఇటీవలే అధికారంలోకి వచ్చిన మావల్లే నిరుద్యోగం పెరిగినట్లు మాట్లాడడం సమంజసం కాదని హితవు పలికారు. గత ప్రభుత్వాలు నియామకాలు చేపట్టకపోవడం వల్లే యువత నిరుద్యోగులుగా మారారని మండిపడ్డారు. అభ్యర్థులు వయస్సు విూరిపోతున్నారంటే దానికి కారణం మేమా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు అవలంబించిన తప్పుల వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. నిరుద్యోగ సమస్యకు కారణమైన మహానుభావులే ఇప్పుడు వెళ్లి నిరుద్యోగులతో ఉద్యమాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ‘ఆ పెంట అంతా మాకు వారసత్వంగా వచ్చింది. ఇన్నేళ్ల చెత్తాచెదారం శుభ్రం చేయాలంటే కొంత సమయం పడుతుంది. చిటికెలో చెత్తను కడిగేయండి అంటే అది సాధ్యం కాదు. ఉద్యోగల భర్తీ కూడా అంతే’ అని అన్నారు. ఒకప్పుడు ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఉండేవని,, ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు పెరిగాయన్నారు. తమ ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు 1.07లక్షల వరకు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. విద్యుచ్ఛక్తి రంగంలో 10 వేల మెగావాట్ల ఉత్పత్తికి శ్రీకారం చుట్టామని వివరించారు. ఎన్టీపీసీ 4 వేలు, తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో 6 వేల మెగావాట్లు విద్యుత్‌ ఉత్పత్తి కానుందనీ, ఈనేపథ్యంలో విద్యుత్‌ రంగంలో 10-12 వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు. రానున్న నాలుగైదు నెలల్లో ఉద్యోగ నియమాకాలు చేపడతామని చెప్పారు. ఉద్యోగుల సంఖ్య, సంస్థల సంఖ్య తేలకపోవడంతో సందిగ్ధత నెలకొందన్నారు. కమలనాథన్‌ కమిటీ ఉద్యోగుల విభజన చేపడితే ఎంత మంది పోతారో.. ఎంత మంది ఉంటారో తెలుస్తది.. అప్పుడు ఎన్ని ఖాళీలున్నాయో స్పష్టత వస్తుంది, ఆ వెంటనే ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. కమలనాథన్‌ కమిటీ తేల్చేస్తే ఖాళీల భర్తీ సులభతరం అవుతుందన్నారు. కొన్ని శాఖలను విస్తృతం చేయాల్సి ఉంటుంది. మరికొన్నింటిని కుదించాల్సి ఉంటుంది.. ఆ తర్వాత ఖాళీలపై స్పష్టత వస్తుందన్నారు. ప్రతీ ఖాళీని భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని గుర్తు చేశారు. త్వరలోనే కమిషన్‌ నియామకం చేయబోతున్నామని వెల్లడించారు. పరిస్థితిని మొత్తం ఒకసారి బేరీజు వేసుకొని ఏ క్యాడర్‌లో ఎన్ని పోస్టులు వస్తాయి.. ఎన్ని భర్తీ చేయాలో నిర్నయిస్తామన్నారు. లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

నిబంధనల ప్రకారమే క్రమబద్ధీకరణ

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చాలా తీవ్రమైన సమస్య అని కేసీఆర్‌ అన్నారు. క్రమబద్ధీకరణ సమయంలో రాజ్యాంగ నిబంధనలు, రిజర్వేషన్లు, రోస్టర్‌ విధానాన్ని పాటిస్తామని స్పష్టం చేశారు. ఒకవైపు ఉద్యోగుల వయస్సు పెరిగిపోతుంది.. మరోవైపు భవిష్యత్‌పై గందరగోళం నెలకొంది. కానీ వారికి తాము న్యాయం చేస్తామని చెప్పారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం.. ఇచ్చిన మాటకు కట్టుబడి చేస్తామని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్‌ పద్ధతి తీసుకొచ్చిన పుణ్యాత్ముడు ఎవరో అందరికీ తెలిసిందే.. ఇప్పుడు వారే క్రమబద్ధీకరణపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరేమన్నా వంద శాతం క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు. క్రమబద్ధీకరణ సందర్భంగా రాజ్యాంగ నిబంధనలు, రిజర్వేషన్లు, రోస్టర్‌ విధానాన్ని పాటిస్తామని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. అన్ని శాఖలో కలిపి 25 వేల లోపే కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉన్నారని, వారిలో 21 వేల మంది ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అర్హులని తేలిందన్నారు. వారిని దశల వారీగా క్రమబద్ధీకరిస్తామన్నారు. సీఎస్‌ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత క్రమబద్ధీకరణ చేపడతామన్నారు.

వారు ఉద్యోగులు కారు..

అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు ప్రభుత్వ ఉద్యోగులు కారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వారిని ఉద్యోగుల పరిగణించబోమని తెలిపారు. ‘కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు పథకాల్లో రకరకాల ఉద్యోగులు పని చేస్తున్నారు.. అందులో అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు తదితరులు ఉన్నారు. వాళ్లందరూ తమకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ఓ పథకం కింద వారు వచ్చారు.. ఆ పథకం అయిపోగానే వారి పని అయిపోతుందని’ స్పష్టం చేశారు. వాళ్లు ఉద్యోగులు కారు… వారిని ఉద్యోగాల్లోకి తీసుకొనే ప్రసక్తే లేదన్నారు. ఎంత వరకైతే తాము తీసుకోగలమో అంతవరకూ తీసుకుంటామని చెప్పారు. అలాగే, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వెయిటేజీ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

త్వరలోనే పారిశ్రామిక విధానం

పరిశ్రమాల ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. రేపో, ఎల్లుండో నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. దేశంలోనే అత్యుత్తమ విధానాన్ని తెస్తున్నామని, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇండియాలో ఏ రాష్టాన్రికి లేని విధంగా మన దగ్గర భూములు అందుబాటులో ఉన్నాయని, ప్రస్తుతం 2.35 లక్షల ఎకరాలను ఏపఐఐసీకి అప్పగించామన్నారు. ఫార్మా, పౌల్టీ రంగాల్లో దేశంలోనే మన రాష్ట్రం ముందుందని, ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. నిరుద్యోగ యువత ఎలాంటి నిరాశకు గురికావొద్దని కోరారు. ఉద్యోగుల విభజన పూర్తి కాగానే నియామకాలు చేపడతామని ప్రకటించారు.

యువతకు భరోసా కల్పించాలి : లక్ష్మణ్‌

ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో యువతకు అన్యాయం జరుగుతోందని బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థులు, యువతదే కీలక పాత్ర అని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో యువత ఉన్నారని, వారి ఆశలను కాలరాయొద్దని కోరారు. తెలంగాణ వచ్చినప్పటికీ చిరుద్యోగులకు ఉద్యోగ భద్రత లేదని.. దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాలంటే ఉద్యోగుల సహకారం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల నియామకాల కోసం యువత ఆశగా ఎదురుచూస్తోందని.. పోలీసు, విద్యాశాఖలో తప్పితే మిగతా ఉద్యోగ నియామకాలు జరగడం లేదన్నారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. వీలైనంత త్వరగా కమిషన్‌ను ఏర్పాటు చేసి, ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.

ఉపాధి అవకాశాలు కల్పించాలి: చిన్నారెడ్డి

నియామక ప్రకటనల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తుందోనని నిరీక్షిస్తున్నారని చెప్పారు. ఓ పక్క ఓయూలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. 1.52 కోట్ల మంది చదువుకున్న యువత ఉంటే.. కేవలం లక్ష ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగం అంటే సాధ్యం కాని పని అని, నైపుణ్యాల అభివృద్ధితో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.