ప్రత్యేక రాయలసీమ కోసం పోరాటాలు ఖాయం ప్రత్యేక రాష్ట్రాల వల్ల ప్రయోజనాలెన్నో..

రాయలసీమ జనతా పార్టీ వ్యవస్థాపకులు కొత్తూరుకర్నూలు, జూలై 17 :జాతీయ స్దాయిలో నదుల అనుసంధానమే రాయలసీమ ప్రాంత సమస్యలకు పరిష్కార మార్గమని, ఈ ప్రాంత రైతాంగానికి ఒక వరం అని ,రాయలసీమ కోసం పోరాటాలు, ఉద్యమాలు ఇక తీవ్రతరం అవుతాయని రాయలసీమ జనతా పార్టీ వ్యవస్దాపకులు కొత్తూరు సత్యనారాయణ గుప్త స్పష్టం చేశారు. నందికొట్కూరులో ఉదయం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం కరువు నుండి బయట పడాలంటే నదుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఏ రాజకీయ పార్టీ కూడా దీని పై నోరు మెదపడం లేదని, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పడితే నష్టపోతామని ప్రజలను మభ్య పెట్టి ఈ ప్రాంత ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు కొందరు నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఇకమీదట సాగబోవన్నారు. ప్రజలలో రాయలసీమ ప్రాంత అభివృద్ది కోసం ఉద్యమానికి సిద్దమౌతున్న రోజులొచ్చాయన్నారు.తమ పార్టీ మొదటి నుండి కూడా నదుల అనుసంధానం చేయాలని కోరుతూ వచ్చిందని, ఇటీవల సుప్రీంకోర్టు కూడా దేశంలో నదుల అనుసంధానం చేయాలని కేంద్రానికి సూచించిందన్నారు. కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం చేస్తే రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, దీని పై అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని కోరారు. గతంలో రాయలసీమ కోసం ఉద్యమాలు చేసిన నేతలు నేడు మేల్కొన్నారన్నారు. రాయలసీమ ప్రాంతంలో పుట్టిన గడ్డకు న్యాయం చేయలేని వారు రాయలసీమ ప్రాంతం నుండి వెళ్లిపోవాలని ఆయన సూచించారు. రాష్ట్రం, దేశానికి అనేక మందిని నాయకులుగా చేసిన రాయలసీమ ప్రాంతానికి సరైన రీతిలో గుర్తింపు లేదని, నాలుగు జిల్లాలు రాయలసీమ ప్రాంతంలో ఉండటం వల్లే రాయలసీమ ప్రాంతానికి గుర్తింపు లేకుండా పోయిందని, ప్రభుత్వం వెంటనే నూతన జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ ప్రాంతం ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని గుర్తించడం లేదని, పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సేవలను అందించే అవకాశం ఉంటుందన్నారు. రాయలసీమ ప్రాంతంలో అన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని, నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే ఆయా ప్రాంతాలు అభివృద్దికి నోచుకుంటాయన్నారు. రాయలసీమ ప్రాంతంలో నంద్యాల, హిందుపురం, ప్రొద్దుటూరు, తిరుపతి ప్రాంతాలను జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని, రాయలసీమ ప్రాంతం నుండి కర్ణాటకకు తరలించిన బళ్లారిని రాయలసీమ ప్రాంతానికి దక్కాలని, దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రాష్ట్రానికి రాయలసీమ ప్రాంతం నుండి ముఖ్యమంత్రులు అవుతున్నా, ఆశించినంత అభివృద్ది జరగలేదని,జరిగిన అవమానం చాలన్నారు. ప్రజా డిమాండ్లను ప్రభుత్వం గుర్తించకపోతే రాయలసీమ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. వివిధ రాజకీయ పార్టీలు కూడా నూతన జిల్లాలకై ఉద్యమాలు చేయాలని, వెనుకబడిన ప్రాంతం రతనాల సీమగా మారుతుందన్నారు. జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తే అభివృద్ది త్వరితగతిన జరుగుతుందని, ఆయా ప్రాంతాల్లో పూర్తి కాని పనులు పూర్తి అవుతాయని, ప్రస్తుతం అధికారులు, ఉద్యోగుల సంఖ్య తక్కువుగా ఉండటంతో పెరుగుతున్న జనాభాకు తగ్గ సౌకర్యాలు, సేవలు పొందే అవకాశం ఉండదన్నారు. నూతన జిల్లాలను ప్రకటించడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని, పార్లమెంట్‌లో ఎంపిల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందన్నారు. రాయలసీమ ప్రాంతం ఎదుర్కోంటున్న సమస్యలను పార్లమెంట్‌లో చర్చించే అవకాశాలుంటాయని, ఇప్పుడు కొంతమంది రాయలసీమ ప్రాంత ఎంపిలు కనీసం ఒక్కసారైన పార్లమెంట్‌లో స్దానిక సమస్యలపై ప్రస్తావన తీసుకుని రాకపోవడం శోచనీయమన్నారు.రాయలసీమ ప్రాంత నిరుద్యోగులు, కార్మికులు, నేతన్నల కోసం , రైతులు ఎదుర్కోంటున్న సమస్యలపై పార్లమెంట్‌లో ప్రస్తావించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాయలసీమ ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రాల నిధులలో కొంత శాతాన్ని రాయలసీమ ప్రాంత అభివృద్దికి ఉపయోగించాలని కోరారు. ప్రాంతాల వారిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, అప్పుడే ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యల పరిష్కారానికి వీలౌతుందని, ఈ నూతన విధానాన్ని తప్పకుండా అవలంభించాలన్నారు. త్వరలో రాయలసీమ రాష్ట్రం కేంద్రం ప్రకటించకపోతే తామే ప్రకటించుకుంటామని, ప్రతి ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన ప్రభుత్వ బోర్డులలో రాయలసీమ రాష్ట్రం వ్రాయిస్తామన్నారు. రాయలసీమ ప్రజలు చేసిన త్యాగాలకు కేంద్రం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
శ్రీశైలం నుండి నీరు వదలడం దారుణం ప్రభుత్వ నిర్వాకం వల్లే ప్రజలకు విద్యుత్‌ కష్టాలొచ్చాయని, ప్రభుత్వానికి ముందు చూపు లేదని విమర్శించారు. శ్రీశైలం నుండి స్లూయిస్‌ గేట్ల ద్వారా నీరు వదలడం వల్ల కర్నూలు, కడప వాసులకు మంచినీటి ఇబ్బందులు పడక తప్పదన్నారు. కొంతమంది అధికారులు సరిగ్గా పని చేయడం లేదన్నారు. పరిశ్రమలు మూతపడే స్థితికి చేరాయని, ఉపాధి లేక నిరుద్యోగులు పడుతున్న కష్టాలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల, రైతుల, ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండు చేశారు.