ప్రధాని పదవిపై ఆసక్తిలేదు పార్టీ పటిష్టతపైనే దృష్టి

‘ అధిష్టాన నిర్ణయం’ అనడం సరికాదు : రాహుల్‌
న్యూఢిల్లీ,మార్చి5(జనంసాక్షి):
ప్రధాని పదవిపై యువనేత రాహుల్‌గాంధీ మరోమారు వైరాగ్యం ప్రదర్శించారు. తనకు పదవికన్నా ప్రజల్లో ఉండడమే ఇష్టమన్నారు. పార్టీని కిందిస్థాయిలో పటిష్టం చేయడమే తనముందున్న లక్ష్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థి రాహుల్‌ గాంధీయే అన్న ఊహాగానాలకు స్వయంగా తానే తెరదించారు. వచ్చే ఎన్నికల తరవాత సోనియా లేదా రాహుల్‌ ప్రధాని అని కేంద్రమంత్రి శశిథరూర్‌ ఇటీవలే ప్రకటించారు. అయితే ఆయన స్వామిభక్తి చాటుకుౖ లీళిందుకు అలా అని ఉన్నా రాహుల్‌ కూడా తనకు పదవి కావాలని నేరుగా అడగడం లేదు. ప్రధాన మంత్రి పదవిపై తనకు ఆసక్తి లేదని, పార్టీలో హై కమాండ్‌ కల్చర్‌ పోవాలని రాహుల్‌ అన్నారు. పార్టీ అధిష్టానానికి, కార్యకర్తలకు మధ్య అగాథం తొలగించాలన్నదే తన లక్షమన్నారు. అలాగే పార్టీలో ఇకముందు నెహ్రూ, ఇందిరలపై చెడుపేరు రాకుండా చూసుకుంటానని అన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు తాను ప్రజల్లో తిరగడానికే ఇష్టపడతానన్నారు. పార్టీనుంచి బయటకు వెళ్లినవారికి, ఎన్నికల్లొ
ళి తిరుగుబాటు అభ్యర్థులుగా నిలిచిన వారికి తిరిగి పార్టీలో ప్రవేశం లేదని రాహుల్‌ గతవారమే కఠినంగా హెచ్చరించారు. వెళ్లిపోయినవారిని తిరిగి పార్టీలోకి తీసుకోవడం ఇకముందు జరగదని కచ్చితంగా చెప్పారు. ఈ క్రమంలో పార్టీని బలపరచడం ఒక్కటే తమ అందరి ముందున్న లక్ష్యమని ఆయన చెప్పారు, కాంగ్రెస్‌ పార్టీలో అధిష్ఠానం సంస్కృతి పోవాలని ఆయన సూచించారు. ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్‌ పార్టీని మరింతగా పటిష్టం చేయడంపైనే తాను దృష్టి కేంద్రీకరిస్తానని ఆయన చెప్పారు. దీర్ఘ కాలిక ప్రాతిపదికపై పార్టీ అభ్యున్నతికి అందరూ కృషి చేయాలని ఆయన పార్టీ నాయకులకు పిలుపు ఇచ్చారు. ఈ నెల ఆరవ తేదీన పార్టీ ప్రధాన కార్యదర్శులతోనూ, ఉన్నత స్థాయి నాయకులతోనూ రాహుల్‌ గాంధి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
2014 వ సంవత్సరంలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలలో రాహుల్‌ గాంధినే ప్రధాన మంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ రంగంలోకి దిగబోతున్నది. అయితే ఈ సమయంలో తనకు ప్రధానమంత్రి పదవిపై మోజు లేదని రాహుల్‌ గాంధి చెప్పినట్టు- జాతీయ స్థాయి వార్తా పత్రికలలోనూ, వివిధ టి.వి. ఛానళ్లలోనూ మంగళవారంనాడు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆయన ఎందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారనేది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బహుశా యూపిఎ పక్షాల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకే ఆయన జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. కాంగ్రెస్‌ పూర్తిస్థాయిలో మెజార్టీ సాధిస్తే ఆయనకాక మరొరకరు ప్రధాని కాబోరని అన్నారు.