ప్రధాని మోదీని కలువనున్న నితీష్
పాట్నా,ఆగస్ట్19(జనం సాక్షి): కులాలవారిగా జనగణన జరగాలనే డిమాండ్‌పై చర్చించేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరారు. సోమవారంనాడు ప్రధానితో సమావేశం కానున్నారు. ఈవిషాయన్ని నితీష్ గురువారంనాడు ఒక అధికార ప్రకటనలో తెలియజేశారు. కులాలవారీ జనగణనను కోరేందుకు బీహార్ ప్రతినిధి బృందంతో కలిసి ప్రధానిని కలుస్తున్నానని, 23న అపాయింట్‌మెంట్ ఇచ్చిన ప్రధానికి కృతజ్ఞతలని అన్నారు. బీహార్‌లో బీజేపీ భాగస్వామ్య పార్టీగా ఉన్న జేడీయూ కులాలవారీ జనగణన కోరుతోందని, ఇది కేవలం బీహార్ డిమాండ్ మాత్రమే కాదని, ఇతర రాష్ట్రాలు కూడా కోరుతున్నాయని నితీష్ ఇటీవల తెలిపారు. తమ పార్టీ ఎంపీలతో పాటు విపక్ష పార్టీల నేతలు కూడా ప్రధానిని అపాయింట్ కోరారని, ఇందుకు సంబంధించి లేఖ కూడా ప్రధానికి రాసామని చెప్పారు. కులాలవారీ జనగణపై 2019లో బీహార్ అసెంబ్లీలోనూ, మండలిలోనూ ఏకగ్రీవ తీర్మానం చేశామని, 2020లో మరోసారి అసెంబ్లీలో తీర్మానం ఆమోదించామని చెప్పారు. కాగా, వచ్చే ఏడాది నాటికి 7 రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్తున్నందున కులాలవారీ జనగణన, దాని ప్రభావం దేశ రాజకీయాలపై పడే అవకాశం ఉందని, ఇది చాలా సున్నితమైన అంశమని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.