ప్రపంచంలోనే ఎత్తయిన టవర్లు నిర్మిస్తాం

1

హుస్సేన్‌సాగర్‌లో మురికినీళ్లు కల్వనివ్వం

సాగర్‌ను ప్రక్షాళన చేస్తాం

మురికినీరు మళ్లింపుకు రూ.100కోట్లు విడుదల

వందెకరాల్లో ఆకాశహర్మ్యాలు

ప్రతి గ్రామానికి రహదారి

సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌, నవంబర్‌ 22 (జనంసాక్షి) : ప్రపంచంలోనే ఎత్తయిన టవర్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. హుస్సేన్‌సాగర్‌లో మురికినీళ్ళు కల్వనివ్వమని, సాగర్‌ను ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. మురికినీరు సాగర్‌లో కల్వకుండా మళ్ళించేందుకు రూ.100కోట్లు విడుదల చేస్తామన్నారు. వందెకరాల్లో ఆకాశహర్మ్యాలు నిర్మిస్తామన్నారు. ప్రతి గ్రామానాకి రహదారి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపడతామని సీఎం ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కార్యదర్శుల ఉపసంఘాన్ని కూడా ఇందుకోసం ఏర్పాటుచేశారు. పర్యావరణ పరిమితులు, సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి హుస్సేన్‌సాగర్‌ చుట్టూ మొదటి దశలో 40 ప్రదేశాల్లోని సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఆకాశహర్మ్యాలు (స్కై స్క్రాపర్స్‌) నిర్మించాలని నిర్ణయించారు. ఆయా ప్రదేశాలను గుర్తించడం కూడా జరిగింది. సచివాలయంలో శనివారం ఆకాశహర్మ్యాల నిర్మాణం, హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనపై దాదాపు 5గంటలపాటు సమీక్ష జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, అధికారులు నర్సింగర్‌రావు, ఎస్‌కె.జోషి, రేమాండ్‌పీటర్‌, నాగిరెడ్డి, ప్రదీప్‌చంద్ర, సోమేష్‌కుమార్‌, స్మితాసబర్వాల్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నదని ప్రకటించారు. సాగర్‌లోకి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు వల్ల జల కాలుష్యం ఏర్పడుతుందన్నారు. దీన్ని నివారించడానికి నాలాల ద్వారా వచ్చే నీరు సాగర్‌లోకి చేరకుండా మళ్ళింపు కాలువలు నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించిన ముఖ్యమంత్రి త్వరలోనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. ఇందుకోసం రూ.100కోట్లు నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వినాయక విగ్రహాలు, అమ్మవారి విగ్రహాల నిమజ్జనం వల్ల హుస్సేన్‌సాగర్‌ కలుషితం అవుతుంనది అన్నారు. సంజీవయ్య పార్కు ప్రాంతంలో ప్రపంచలోనే అత్యంత ఎత్తైన టవర్‌ నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ బుద్ధభవన్‌, రాణిగంజ్‌ బస్‌డిపో,  లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కుందన్‌బాగ్‌, పాటిగడ్డ, సేయిలింగ్‌ క్లబ్‌, యూత్‌ హాస్టల్‌, రాఘవ సదన్‌, నర్సింగ్‌ కాలనీ, దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌, గ్రీన్‌లాండ్స్‌, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, ఎలక్ట్రిసిటి భవన్‌, టెక్స్ట్‌బుక్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌, రిడ్జ్‌ హోటల్‌, బూర్గుల రామకృష్ణారావు బిల్డింగ్‌ ఎక్స్‌పోటెల్‌, స్నో వరల్డ్‌ తదితర 40 ప్రాంతాల్లో మొదటి దశలో టవర్స్‌ నిర్మించాలని నిర్ణయించారు. ఈ స్థలాలకు సంబంధించిన మ్యాప్‌లను కూడా సీఎం పరిశీలించారు.