ప్రపంచీకరణలో ఛిద్రమైన రైతు కూలీలు
పపంచీకరణ విధానాల అమలుతో వ్యవసాయ కూలీల బతుకు ఛిద్రమవుతోంది. భారతదేశంలో 80 శాతం మంది వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైనప్పటి నుంచి విద్య, వైద్యం, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు పూర్తిగా సంక్షోభంలో చిక్కుకున్నాయి. వ్యవ సాయం, భూమి తదితర సమస్యలతో ముడిపడి ఉంది. ప్రపంచీకరణ ఫలితంగా వ్యవసాయ రంగంలో ప్రవేశించిన యాంత్రీకరణ రైతు కూలీలకు శాపంగా మారింది. మాయదారి యం త్రాలతో గ్రామీణ కూలీలకు పనిలేకుండా పో యింది. అధునిక భారీ యంత్రాలతో పరిశ్రమల్లో మానవ శ్రమ అవసరం లేకుండా పోయింది. విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులు లాభాల రూపంలో ప్రజలను లూటీ చేస్తున్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరిట లక్షలాది మంది ప్రజలను గ్రామాల నుంచి వెల్లగొడుతున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఖనిజ సంపద కోసం వారిపై గ్రీన్ హంట్ ప్రయోగించి తరిమేస్తున్నారు. ఓపెన్ కాస్టుల పేరిట సింగరేణి గనులు విస్తరించి ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లా ల నుంచి వేలాది మంది రైతులను నిర్వాసితులను చేస్తున్నారు. ఓపెన్‌కాస్టులతో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఓపెన్ కాస్టులకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. వారి ప్రతిఘటనలు పట్టించుకోకుండానే సర్కారు మొండిగా ముందు కు పోతుంది. కార్పొరేట్ శక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల అవతారమెత్తి రైతుల భూములను లాక్కుంటున్నాయి. భూమి.. భూస్వాములు, పెట్టు బడిదారులు, కార్పొరేట్ శక్తుల చేతిలో చిక్కు కుంది. ఈ స్వార్థశక్తుల పుణ్యమా అని భూగర్భ జలాలు పాతాళానికి పోయాయి. వర్షాలు సకా లంలో కురవక కరువు కాటకాలు సంభవి స్తున్నాయి. రసాయన ఎరువులు, విత్తనాల ధర లను కార్పొరేట్ శక్తులు శాషిస్తున్నాయి. మార్కెట్లో నకిలీ విత్తనాలు, ఎరువులు విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. తెలియక వాటిని కొనుగోలు చేసే రైతులు తీవ్ర నష్టాన్ని మూటగట్టుకుంటు న్నారు. సేంద్రియ, సహజ ఎరువులు లేకుండా పోయాయి. పశుసంపద అంతరించిపోతోంది. భూముల్లో రసాయన ఎరువులు చల్లి విషతుల్య మయ్యాయి. ప్రస్తుత సాగుభూమిలో 65 శాతం పనికిరాకుండా పోయింది. ప్రపంచీకరణ ప్రభా వంతో పెట్టుబడిదారివర్గం-శ్రామికవర్గం మధ్య ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగాయి. గ్రామీణ ప్రజల జీవన విధానాలు దిగజారి పోయాయి. శతకోటీశ్వరుల సంఖ్య పెరిగి పోతుంది. పేదరికం భారీగా పెరిగింది. భారత దేశంలో 2005 నుంచి 2013 మధ్య ఆత్మహ త్యలు, ఆకలి చావుల సంఖ్య గణనీయంగా పెరి గింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యా నా, పశ్చిమ బెంగాల్, అగర్తలా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఆత్యహత్యలు, బలవంతపు చావులు ఎక్కువ య్యాయి. ఇప్పటి వరకు 2.50 లక్షల కుటుం బాలు ఆకలి చావులతో కకావికలమయ్యాయి. వ్యవసాయంలో సంక్షోభం కారణంగా 15 లక్షల మంది కూలీలు బతుకుదెరువు కోసం పొట్టచేతపట్టుకొని వలస పోతున్నారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో దుర్భర జీవితాలు వెళ్లదీస్తు న్నారు. కొంత మంది రైతులు, కూలీలు రక్తం, కిడ్నీలు అమ్ముకొని కుటుంబాలను సాకుతున్నారు. వ్యవసాయం పతనం కావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలే కారణం. ఈ విధానాల మూల కారణాలు సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణతో కూడిన ఆర్థిక సంస్కరణలు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాల్లో సామ్రాజ్యవాదుల గుత్తాధిపత్యం పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారంలో ఆయా శక్తుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. కోట్లాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న వ్యవసాయంపై సామ్రాజ్యవాద దోపిడీదారుల కన్నుపడింది. ఫలితంగా వ్యవసాయం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ప్రపంచ బ్యాంకు ఆదేశాలు వేగవంతం అయ్యాయి. అడవులను నమ్ముకొని బతుకుతున్న ఆదివాసీలు, గిరిజనుల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయి. ఖనిజ సంపదను గద్దల్లా తన్నుకుపోతూ అడవి బిడ్డల హక్కులను కాలరాస్తున్నారు. కార్పొరేట్ వ్యవసాయం ఫలితంగా రైతులు కూలీలుగా మారారు. వ్యవసాయ కూలీలకు కనీసం పనిలేకుండా పోయింది. వారికి కల్పించే పనిదినాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు అనేక సర్వేలు వెల్లడించాయి. దేశంలో సుమారు 6 కోట్ల మంది వ్యవసాయ కూలీలున్నారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్ల సంఖ్య 5 కోట్లకు దాటాయి. దుక్కి దున్నడానికి, విత్తనాలు వేయడానికి, నాటు, కలుపుతీత, పంట కోతలకు యంత్రాలనే వినియోగిస్తున్నారు. ఒకప్పుడు వరికోతల సీజన్‌లో చేతినిండా పనితో బిజీగా ఉండే కూలీలను పనికి పిలిచే వారే కరువయ్యారు. ప్రభుత్వాల వ్యవసాయ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గ్రామాలకు గ్రామాల్లో రైతులు క్రాప్ హాలీడేకు సిద్ధపడ్డారు. ఒక్కోసారి ప్రభుత్వాలే క్రాప్ హాలీడే ప్రకటించడంతో కూలీలకు కనీసం పనిదొరకని పరిస్థితి తలెత్తింది. నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో లేనంతగా పెరిగిన ప్రస్తుత తరుణంలో చాలీచాలని వేతనంతో కూలీల బతుకులు దుర్భరమయ్యాయి. పెట్టుబడిదారి శక్తులు మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి వస్తువుల ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచేశాయి. కార్పొరేట్ వ్యవసాయానికి సర్కారు తలుపులు బార్లా తెరవడం, ప్రైవేటు వడ్డీ వ్యాపారులు రైతులకు అప్పులిచ్చి పెద్ద ఎత్తున వడ్డీ వసూలు చేయడంతో చిన్న, సన్నకారు రైతులు ఆర్థికంగా చితికిపోయారు. ఆహార సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రరూపం దాల్చింది. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మందికి ఆహారం అందుబాటులో లేదు. మన దేశ జనాభాలో 45 శాతం అంటే 49 కోట్ల మందిది అదే పరిస్థితి. ఆహార కొరత, పోషకాహారలోపంతో ప్రజలు వ్యాధుల బారినపడి మృత్యువాతపడుతున్నారు. దేశంలో ఏటా వీటి ఫలితంగా మరణిస్తున్న వారి సంఖ్య 25 లక్షల మంది వరకూ ఉండొచ్చని అంచనా. ఆకలి, పేదరికానికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న ఆకలి పోరాటాలను పోలీసుల బలగాల దౌర్జన్యంతో అణచి వేయిస్తున్నారు. దేశంలో ఇప్పటికీ 60 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన బతుకీడుస్తున్నారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఇది 95 శాతం వరకూ ఉంటుంది. రైతులు, చేనేత కార్మికులు, కూలీలు, ఇతర కార్మికులు లక్షల సంఖ్యలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కులవృత్తులు కూలీపోయాయి. గ్రామీణ జనజీవనం ఆదాయ వనరులు లేక తల్లడిల్లుతోంది. సుమారు ఆరు కోట్ల మంది ఆదివాసీలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉపాధి అవకాశాలు అందడం లేదు. వారిపై కేంద్ర అధర్మయుద్ధం ప్రకటించి సాగిస్తోంది. ప్రపంచీకరణ విధానాల వల్ల ఖనిజ సంపద, ప్రకృతి వనరులు, భూమి, నీరు, అడవులు, గనులు, ఇతర వనరులపై గుత్తాధిపత్యం కోసం సామ్రాజ్యవాద శక్తులు ఎన్నో కుయుక్తులు పన్నుతున్నాయి. ఇప్పటికే వీటిలో కొన్ని వారి వశమైపోయాయి. లక్షలాది మంది ఉపాధిని దెబ్బతీశాయి. ఫలితంగా రైతులు, కూలీల జీవితాలు అతలాకుతలం అయ్యాయి. రైతాంగం పూర్తిగా ఛిద్రమవుతోంది. కోట్లాది మంది బతుకులను నాశనం చేసిన ప్రపంచీకరణ విధానాలు పాడె గడితేగాని మానవ మనుగడ సాధ్యం కాదు. ఆ విధానాలను పాడెక్కియాలంటే రాజకీయ పార్టీల విధానాల్లో సమూల మార్పులు తెచ్చేందుకు బలమైన రైతాంగ పోరాటాలను నిర్మించాలి.
– దామరపల్లి నర్సింహారెడ్డి