ప్రభుత్వమా .. తెలంగాణ ప్రజలను

రెచ్చగొట్టొద్దు : ఈటెల
నిర్బంధానికి భయపడం : నాగం
హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి): తెలంగాణ ప్రజలను ప్రభుత్వమే రెచ్చగొడుతోందని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇవ్వాలని టిఆర్‌ఎస్‌, తెలంగాణ నగారా సమితి నేతలు గురువారంనాడు డీజీపీ దినేష్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఈటెల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణమార్చ్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని, అనుమతి ఇవ్వాలని డీజీపీని కోరామని ఈటెల చెప్పారు. శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. దాడులు జరుగుతాయంటూ ప్రభుత్వమే ప్రజలను రెచ్చగొడుతోందని విమర్శించారు. కవాతులో తెలంగాణ మంత్రులు పాల్గొని తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని ధ్వజమెత్తారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపాలని చూస్తే ప్రభుత్వ మూర్ఖత్వమేనని అన్నారు. తెలంగాణమార్చ్‌ను నిర్వీర్యం చేసేందుకు పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు. అరెస్టయిన వారిని వెంటనే విడుదల చేయాలని ఈటెల డిమాండు చేశారు. అనంతరం తెలంగాణ నగారా సమితి కన్వీనర్‌ నాగం జనార్దనరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల స్వేచ్ఛను హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. బైండోవర్లు, అరెస్టులతో మార్చ్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌ తెలంగాణ ప్రజల గడ్డ అని నాగం అన్నారు. హైదరాబాద్‌కు వచ్చేందుకు వీసాలు తీసుకోవాలా అని ప్రశ్నించారు. మార్చ్‌ను ఏ విధంగా అడ్డుకుంటారో చూస్తామని ఆయన సవాల్‌ విసిరారు. పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణమార్చ్‌ను విజయవంతం చేసి తెలంగాణ ప్రజల సత్తా ఏమిటో చూపాలని ఆయన పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 30 తర్వాత ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ హైదరాబాద్‌ రాక తప్పదని జోస్యం చెప్పారు. అరెస్టులతో, బైండోవర్లతో ఉద్యమాన్ని ఆపలేరని నాగం హెచ్చరించారు.