ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యుత్ సంక్షోభం
నారాయణ, రాఘవులు ధ్వజం
హైదరాబాద్, జూలై 16 (జనంసాక్షి):
ప్రభుత్వ అసమర్ధతతో విద్యుత్ రంగం పూర్తిగా సంక్షోభంలోకి కూరుకు పోయిందని వామపక్షాలు మండిపడ్డాయి. సోమవారంనాడు ఇంధన వ్యయ సర్దుబాటుపై రెడ్ హిల్స్‌లోని సింగరేణి భవన్‌లో బహిరంగ చర్చ జరిగింది. చర్చ వేదికలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శినారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, తదితరులు పాల్గొన్నారు. ఎపిఆర్‌పి సర్దుబాటుపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వామపక్ష నేతలు ఖండించారు. మీడియాతో రాఘవులు మాట్లాడుతూ సర్‌చార్జి పేరుతో ప్రజలపై ప్రభుత్వం 10వేల కోట్ల రూపాయల మేర భారం వేయనున్నదని అన్నారు. రెండు సంవత్సరాల క్రితం వినియోగించబడిన విద్యుత్‌పై సర్‌చార్జి వసూలు చేయడం దారుణమని ఆయన విమర్శించారు. సర్‌చార్జిని అమలు చేస్తే సహాయ నిరాకరణ ఉద్యమం చేపడతామని రాఘవులు హెచ్చ రించారు. ముఖ్యంగా రిలయన్స్ గ్యాస్ రాష్ట్ర అవసరాలకు వినియోగించుకుంటే విద్యుత్ కోతలు ఉండబోవని ఆయన అన్నారు. విద్యుత్ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని రాఘవులు విమర్శించారు. సర్‌చార్జి పేరుతో విద్యుత్ చార్జీలు సైతం పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాఘవులు విమర్శిం చారు. ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచితే మరో బషీర్‌బాగ్ ఉద్యమం లేవనెత్తుతామని రాఘవులు హెచ్చరించారు. సిపిఐ నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఇంధన వనరులను పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. జెన్‌కోకు అందాల్సిన ముడి సరుకును ప్రభుత్వం అందించలేకపోతోందని అన్నారు. జెన్‌కో సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని నారాయణ మండిపడ్డారు. విద్యుత్ సర్‌చార్జిలను వసూలు చేస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ప్రైవేటు సంస్థలు రాష్ట్రంలోని గ్యాస్ నిల్వలను తరలించుకువెళుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ అసమర్ధత వల్ల విద్యుత్ కోతలు పెరిగిపోయాయని, దీంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నారాయణ విమర్శించారు. ముఖ్యంగా ఎస్‌ఎస్‌ఎ వసూళ్లను ప్రభుత్వం భరించాలని నారాయణ డిమాండు చేశారు. విద్యుత్ కోతలను ఎత్తివేయకపోతే ప్రభుత్వ పాలనను స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు.