ప్రభుత్వ అసమర్ధత వల్లే..రాష్ట్రంలో చీకటి : దత్తాత్రేయ

హైదరాబాద్‌, జూలై 13 ప్రభుత్వ అసమర్ధత వల్లే..రాష్ట్రంలో చీకటి : దత్తాత్రేయ : ప్రభుత్వ అసమర్ధతతోనే రాష్ట్రం చీకటిప్రదేశ్‌గా మారిందని బిజెపి సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ ఆరోపించారు. శుక్రవారంనాడు హైదరాబాద్‌లో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడంతో విద్యుత్‌ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యంతో ప్రజలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని దత్తాత్రేయ మండిపడ్డారు. విద్యుత్‌ చార్జీలు పెంచి విద్యుత్‌ కోతలు విధిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికే దక్కిందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల చిన్నతరహా పరిశ్రమలు మూతపడే దశకు చేరుకున్నాయని ఆయన అన్నారు. దీంతో దాదాపు 30 లక్షల మందికి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గ్యాస్‌తో 2500 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. గ్యాస్‌ పంపిణీ కోసం ముఖ్యమంత్రి కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడంలేదని దత్తాత్రేయ ప్రశ్నించారు. కేవలం తన పదవిని కాపాడుకోవడం కోసమే ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి చేపట్టబోయే ఇందిరమ్మ బాట కార్యక్రమం చీకటిబాట పడుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు కిరణ్‌కుమార్‌రెడ్డికి లేదని దత్తాత్రేయ అన్నారు. విద్యుత్‌ వినియోగదారులపై మోపుతున్న బారాన్ని ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ చార్జీల విషయంలో ప్రభుత్వం, రెగ్యులేటరీ కమిషన్లు వాస్తవాలను కప్పిపెట్టి ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. రెండు సంవత్సరాల క్రితం వాడిన విద్యుత్‌కు నష్టం వచ్చిందంటూ దానిని ప్రజలే భరించాలని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే రిలయన్స్‌ కంపెనీ కృష్ణా గోదావరి బేసిన్‌ గ్యాస్‌ను గుజరాత్‌కు తీసుకుపోతున్న మాట వాస్తవం కాదా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సర్‌చార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 16 తర్వాత మూడు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. విద్యుత్‌ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. విద్యుత్‌రంగ సమస్యపై చర్చించేందుకు ఈ నెల 23న జూబ్లీహాల్‌లో నిపుణులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుకుంటున్నది కాంగ్రెస్‌ పార్టీ నేతలేనని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని దత్తాత్రేయ ఆరోపించారు.