ప్రభుత్వ ఏర్పాటుకు గడువివ్వండి

గవర్నర్‌ను కోరిన జేఎంఎం
రాంచీ, జనవరి 12 (జనంసాక్షి): జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ప్రత్యామ్నయ ప్రభుత్వ ఏర్పాటుకు మరికొంత సమయం ఇవ్వాలని జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) శనివారం గవర్నర్‌ సయ్యద్‌ అహ్మద్‌కు విజ్ఞప్తి చేసింది. శనివారం ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో జేఎంఎం చీఫ్‌ శిబుసోరెన్‌, ఆయన కుమారుడు హేమాంత్‌ సోరెన్‌, ఇతర నాయకులు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు మరికొంత గడువు కావాలని కోరారు. గవర్నర్‌తో భేటీ అనంతరం హేమంత్‌ సోరెన్‌ విూడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కొంత సమయం కావాలని కోరినట్లు కప్పారు. ప్రత్యామ్నయ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు
కాంగ్రెస్‌ నేతలతో శిబుసోరెన్‌ చర్చించారన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్‌ త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తుందని చెప్పారు.జనవరి 8న జేఎంఎం మద్దతు ఉపసంహరించుకోవడంతో అర్జున్‌ ముండా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కుప్పకూలింది. అసెంబ్లీని రద్దు చేయాలని ముండా మంత్రివర్గం గవర్నర్‌కు సిఫార్సు చేసింది. అయితే, మంత్రివర్గ సిఫార్సును తోసిపుచ్చిన గవర్నర్‌ రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫార్సు చేశారు. మరోవైపు, కాంగ్రెస్‌తో కలిసి ప్రత్యామ్నయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జేఎంఎం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే జేఎంఎంకు కాంగ్రెస్‌తో పాటు ఆర్జేడీ, స్వతంత్రుల మద్దతు తప్పనిసరి. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ కానీ, రాష్ట్ర నేతలు కానీ సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు.