ప్రభుత్వ కళాశాలల్లో విలువలతో కూడిన విద్య

శాతవాహన యూనివర్సిటీ, జనంసాక్షి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనే నైతిక విలువలతో కూడిన విద్యా బోధన జరుగుతోందని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల సంఘం రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి అన్నారు. స్థానిక ఆర్ట్స్‌ కళాశాలలో శుక్రవారం జరిగిన ప్రభుత్వ లెక్చరర్ల సంఘం సమావేశంలో మాట్లాడారు. అణగారిన వర్గాల అభివృద్ధిలో పాలు పంచుకోవడంలో లెక్చరర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రైవేటు కళాశాలల మధ్య పోటీతో ప్రభుత్వ కళాశాలలు బలహీనపడుతున్నాయని పేర్కొన్నారు. ఇంటర్‌ విద్య పరిరక్షణకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు ఐక్యంగా పోరాడాలన్నారు. జూనియర్‌ లెక్చరర్లకు ప్రిన్సిపాళ్లుగా, డిగ్రీ లెక్చరర్లుగా పదోన్నతులు ఇప్పించేందుకు మార్గం సుగమమైందన్నారు.

సమావేశంలో జూనియర్‌ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సురేందర్‌రెడ్డి , శశిధర్‌శర్మ, తెలంగాణ
సంఘం ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి , సంఘం ప్రతినిధులు సురేందర్‌, శ్రీనివాస్‌రెడ్డి , సంగీతారాణి, రాజేశ్వర్‌రావు, ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు రామచంద్రం, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం మధుసూదన్‌రెడ్డి ఆర్‌ఐవో కార్యాలయంలో జరుగుతున్న ఇంటర్‌ ప్రశ్న ప్రతాల మూల్యాంకన శిభిరాన్ని సందర్శించి వసతి సౌకర్యాలు , వారి సమస్యలపై ఆరా తీశారు.