ప్రభుత్వ తోడ్పాటుతో మారిన బతుకులు

జిల్లాలో 45 టన్నుల చేపల ఉత్పత్తి
కొత్తగూడెం,మే31(జ‌నం సాక్షి): గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగా ఈ ఏడాదికి సీజన్‌లో 45 టన్నుల చేపలు ఉత్పత్తి చెందినట్లు మత్స్యకారులు చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు మహర్దశ కలిగిందని చెబుతున్నారు. మత్స్య కారుల జీవితాలకు తెలంగాణ సర్కార్‌ భరోసా కల్పించారని అన్నారు. నూరుశాతం సబ్సిడీతో చేప పిల్లలను సరఫరాకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేజ్‌ కల్చర్‌ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఉచిత చేప పిల్లల పెంపకానికి అనూహ్య స్పందన రావడంతో జిల్లాల్లో మత్స్యకారుల సొసైటీలు ముందు కొచ్చి వారు ఏర్పాటు చేసుకున్న సొసైటీ చెరువుల్లో చేప పిల్లల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 54 మత్స్యకారుల సంఘాలు ఉన్నట్లు అధికారులు అధికారికంగా గుర్తించారు. వీరంతా 271 చెరువుల్లో చేప పిల్లలను పెంచుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌ నెలలో పంపిణీ చేసిన ఈ చేప పిల్లలు ఈ ఏడాదికి 600 గ్రాములకు పైగా బరువు పెరిగాయి.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9,150 కుటుంబాలు చేపల వృత్తుల ద్వారా జీవనాధారం సాగిస్తున్నాయి. మరో రెండు వేల కుటుంబాలు చేపల వేట ద్వారా జీవనం సాగిస్తున్నా సహకార సంఘాల్లో సభ్యులుగా లేకపోవడంతో వారు కూడా ఇదే వృత్తిపై ఆధారపడు తున్నారు. మరిన్ని కుటుంబాలను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి చేపల వేటే వృత్తిగా స్వీకరించే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చాలా కుటుంబాలు గోదావరి తీరాల వెంట రాత్రింబవళ్లు కష్టం పడినా చివరికి చేపలు దొరకని పరిస్థితి ఉండేది. ఇప్పుడిప్పుడే కుటుంబాలు మెరుగు పడుతున్నాయి.