ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు

గుణాత్మక మార్పులు కనిపిస్తున్నాయి: డిఇవో

కొత్తగూడెం,జూన్‌4(జ‌నం సాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెరిగాయని డీఈవో వాసంతి తెలిపారు. సన్నబియ్యంతో భోజన సదుపాయం కల్పించడం వల్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు కూడా భరోసా వచ్చిందన్నారు. సౌకర్యాలతో పాటు గుణాత్మక విద్య, సీసీఈ పద్ధతిలో విద్యార్థులకు విద్యాభ్యాసం చేయడం, ఉత్తమ సిబ్బందితో బోధించడం వంటి అంశాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని డీఈవో వాసంతితెలిపారు. విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం, నూతన కేజీబీవీలు డిజిటల్‌ తరగతి గదుల వంటి వసతులతో పాటు బాలికల విద్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తోందన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో దొడ్డుబియ్యంతో భోజనం పెట్టేవారు. తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తోంది. వారానికి మూడు రోజులు కోడిగుడ్లు, శనివారం వెజ్‌ బిర్యాని అందిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడం వల్ల ఆరోగ్యకరంగా తయారై చదువుల్లో ముందంజలో ఉండేందుకు అవకాశాలున్నాయి. అక్షయపాత్ర ద్వారా కొత్తగూడెం నియోజకవర్గంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నాం. అక్షయపాత్ర భోజనానికి మంచి స్పందన వచ్చింది. ఈ విద్యాసంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీకి సిద్ధం చేశాం. జిల్లా వ్యాప్తంగా 57,115 ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సర్వశిక్షా అభియాన్‌ కింద పనిచేస్తున్న పాఠశాలల్లో 9,10 తరగతి విద్యార్థులకు కూడా ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తున్నాం. అదే విధంగా జిల్లాలో 5,54,910 పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు చేర్చాం. ఈ ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్‌ పద్ధతిని అవలంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. తద్వారా పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరుశాతం పెంచేందుకు దోహదపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా బయోమెట్రిక్‌ను అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. గత ఏడాది జిల్లాలో డిజిటల్‌ తరగతులు ప్రారంభించాం. డిజిటల్‌ తరగతుల వల్ల విద్యార్థులు దృశ్యాలను నేరుగా చూసి మెదడులో సంక్షిప్తం చేసుకునే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు డిజిటల్‌ తరగతులు అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేశాం. డిజిటల్‌ తరగతులకు మంచి స్పందన లభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినుల ఆత్మరక్షణ కోసం మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాం. దీని వల్ల విద్యార్థినుల్లో ఆత్మైస్థెర్యం పెరిగి ఉన్నత చదువుల్లో ర్యాగింగ్‌ వంటి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేం దుకు దోహదపడతాయి. బాలికల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తోంది. కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో బాలికలకు అన్ని రకాల వసతులను ప్రభుత్వం అందిస్తోంది. జిల్లాలో మొత్తం 14 కేజీబీవీలు ఉన్నాయి. ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌ అప్‌గ్రేడేషన్‌ చేయడం వల్ల ఐదు కేజీబీవీల్లో మొత్తం 400 మంది విద్యార్థులు పదో తరగతి పాసై ఇంటర్మీడియట్‌లో చేరారు. తొమ్మిది పాత కేజీబీవీల్లో నూతనంగా అదనపు తరగతి గదుల మంజూరు కోసం ఒక్కో కేజీబీవీకి రూ.3.07 కోట్లు విడుదల చేశారు. నూతనంగా ఐదు కేజీబీవీలను గత ఏడాది నుంచి ప్రారంభించారు. జిల్లాలోని 14 కేజీబీవీల్లో పౌష్టికాహారంతో కూడిన నూతన మెనూను అమలు చేస్తున్నామని వివరించారు.

——————-