ప్రమాద ఘంటికలు మోగిస్తున్న స్వైన్‌ఫ్లూ
-వికృతరూపం దాలుస్తున్న మహమ్మారి
-నగరం నుంచి జిల్లాలకు వ్యాప్తి
-చాప కింద నీరులా ఫ్లూ
-12 మంది జూడాలకు స్వైన్‌ఫ్లూ లక్షణాలు
32చేరిన మృతులు
హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది.ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. చాపకింద నీరులా పాకుతోంది. రాష్ట్ర రాజధానికే పరిమితమైన ఈ వ్యాధి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా మిస్తరిస్తోంది. వైద్యానందించే డాక్టర్లకు సైతం ఈ వ్యాధి ప్రబలుతోందంటే వ్యాధి తీవ్రతను అంచనా వేయొచ్చు. గాంధీ ఆసుపత్రిలో ఏకంగా 12 మంది జూనియర్ డాక్టర్లకు స్వైన్‌ఫ్లూ సోకింది. వైద్యులను సైతం కలవరపెడుతున్న ఈ వ్యాధి రోజురోజుకు వేగంగా విస్తరిస్తోంది. పరిస్థితిని అంచనా వేయడంలో వైద్యఆరోగ్యశాఖ అధికారులు విఫలం కావడంతో చాపకింద నీరులా వ్యాధి విస్తరిస్తునే ఉంది. ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సనందించటానికి ఏర్పాటు చేసిన విభాగాలలో సరైన సదుపాయాలు లేకపోవడం వల్లనే వైద్యులకు సైతం వ్యాధి సోకుతున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన నెల రోజుల్లో రాష్ట్రంలో మొత్తం 1398 మందికి పరీక్షలు నిర్వహించగా 509 మందికి స్వైన్ ఫ్లూ సోకిందని అధికారికంగా నిర్థారణ అయ్యింది. రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మహమ్మారిని నిర్లక్ష్యం చేయటం మూలంగా ఈ పరిస్థితి దాపురించిందని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వైన్‌ఫ్లూ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 509 కేసులు నమోదు కాగా ఒక్క గాంధీ ఆసుపత్రిలోనే 53 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే వ్యాధిబారిన పడి 32మందికి పైగా మృత్యువాతపడ్డారు.
అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఈ వ్యాధి వేగంగా ప్రబలుతోంది. ఆసుపత్రులకు వస్తున్నవారికి వెంటనే మెరుగైన వైద్యచికిత్స అందించాల్సిన అవసరమున్నందున ఆసుపత్రుల్లో మందులు, చికిత్స విధానం అందుబాటులోకి తీసుకొస్తున్నామని అధికారులు చెప్తున్నారు. కానీ వాస్తవానికి వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికీ స్వైన్‌ఫ్లూ విభాగాలు ఏర్పాటు కాలేదు. పిల్లల విభాగాల్లోనూ దాని నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు కనిపించడంలేదు. స్వైన్‌ప్లూ తీవ్రత పెరగకుండా బోధనాసుపత్రుల్లో, జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేకవార్డును ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా సరైన మౌళిక వసతులు కల్పించకపోవడంతో వ్యాధి డాక్టర్లను సైతం ఆవహిస్తోంది. నెల రోజులుగా స్వైన్ విజృంభిస్తున్నా.. నివారణపై ప్రజల్ని చైైతన్యపరచడంలో విఫలమైన వైద్య ఆరోగ్యశాఖ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వైన్‌ఫ్లూ నియంత్రణ చర్యల్లో అలసత్వం వహించిన అధికారులపై సర్కారు వేటు వేసింది. స్వైన్‌ఫ్లూ నివారణలో వైఫల్యం చెందారంటూ ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య, సంచాలకుడు సాంబశివరావుపై ప్రభుత్వం వేటు వేసింది. స్వైన్‌ఫ్లూ స్వైర విహారాన్ని అడ్డుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే వివిధ స్థాయిల్లో సవిూక్షలు జరపడమే కాక స్వైన్‌ఫ్లూను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చినట్లు ప్రకటించారు. కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులతోనూ సీఎం సమావేశమయ్యారు. కానీ కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ఇప్పటికీ స్వైన్‌ఫ్లూ వార్డులు ఏర్పాటు చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు వ్యాధి తీవ్రతను అంచనావేసేందుకు వచ్చిన కేంద్రకమిటీ సైతం పరిస్థితిని సమీక్షించింది. అయితే రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ కేసులు ఇంకా నమోదవుతునే ఉన్నాయి.
సౖౖెబీరియన్ గాలులతో అధికపీడనం ఏర్పడి తెలంగాణలో చలి విపరీతంగా పెరిగింది. మరో 15 రోజులపాటు వాతావరణం ఇలాగే ఉండొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గడచిన 15 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చల్లని వాతావరణంలో స్వైన్‌ఫ్లూ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. జలుబుతో కూడిన జ్వరం, ఒళ్లు నొప్పులు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఇక తెలంగాణలో వ్యాధి తీవ్రత తగ్గుముఖం పడుతోందని నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్ పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన వ్యాధికి చికిత్స అందించేందుకు అవసరానికి మించి మందులు అందుబాట్లో ఉన్నాయన్నారు. మరోవైపు హోమియోపతిలోను వ్యాధి నివారణకు మంచి మందులున్నాయని హోమియో వైద్యులు చెప్తున్నారు. ఆర్సినికం ఆల్బం విరివిగా ప్రచారంలో ఉన్నా హోమియోలోని ఇన్‌ఫ్లుయాంజినం కూడా స్వైన్‌ఫ్లూ నివారణకు మెరుగ్గా ఉపయోగపడుతోందంటున్నరు. వ్యాధి వచ్చిన తర్వాత నొప్పులు, చలి తగ్గింటచానికి హోమియోలోని యూపటోరియంపర్ఫోలియేటం ఔషధం కూడా బాగా పనిచేస్తోందని చెప్తున్నరు. ఏదేమైనా వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం మరింత చొరవ చూపాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యం వహిస్తే స్వైన్ మహమ్మారి రాష్ట్రాన్ని కబలించే ప్రమాదం పొంచి ఉంది. ప్రజలు సైతం పరిశుభ్రతను పాటించి వ్యాధి వ్యాప్తి చెందకుండా చూసుకోవాలి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో సంచరించకూడదు. చలిలో తిరగకుండా ఉండాలి ఒకవేళ తప్పనిసరైతే చలినుంచి రక్షించే దుస్తులను విధిగా ధరించాలి. ఇలా అంతా సమిష్టిగా కృషి చేస్తేనే వ్యాధిని అరికట్టేందుకు వీలవుతుంది.