ప్రశాంతంగా ఎంసెట్‌

భానుడి భగభగలు.. నిమిషం గండం
విద్యార్థుల అవస్థలు
హైదరాబాద్‌, మే 10 (జనంసాక్షి) : రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్‌ ప్రశాంతంగా ముగిసింది. ఎండలు, ట్రాఫిక్‌ వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ‘నిమిషం’ నిబంధన వల్ల సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోలేని పలువురు విద్యార్థులను అధికారులను లోనికి అనుమతించ లేదు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోక పోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు. ఉదయం 10 గంటలకు ఇంజనీరింగ్‌, మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించిన మెడిసిన్‌ పరీక్షకు హాజరయ్యేందుకు విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. వారి వెంట తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలతో కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే, ఆయా కేంద్రాల్లో అధికారులు సరైన ఏర్పాట్లు చేయని కారణంగా విద్యార్థులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. తాగునీరు వంటి కనీస వసతులు కల్పించలేదు. కొన్ని పరీక్షా కేంద్రాల్లో చీకటి ఉండడం, ఫ్యాన్లు లేకపోవడంతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరయ్యారు. తరలిరావడంతో పరీక్షాకేంద్రాల వద్ద సందడి నెలకొంది. దాదాపు 4 లక్షల మందికిపైగా ఎంసెట్‌ పరీక్ష రాస్తున్నారు. ఇంజనీరింగ్‌ కోసం 2.91 లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా, మెడిసిన్‌ కోసం 1.05 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 30 నగరాల్లో ఇంజనీరింగ్‌ విద్యార్థుల కోసం 534 పరీక్షా కేంద్రాలు, మెడికల్‌ విద్యార్థుల కోసం 201 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పటిష్ట బందోబస్తు..
గతానుభవాల దృష్ట్యా పరీక్షా కేంద్రాల భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. బందోబస్తుతో పాటు జామర్లను కూడా ఏర్పాటు చేశారు. మఫ్టీ పోలీసులను కూడా రంగంలోకి దింపారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోనికి అనుమతించారు. హాల్‌టికెట్‌తో పాటు ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ఫాం ఉంటేనే పరీక్ష రాసేందుకు పంపించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద భారీగా పోలీసులను మోహరించడంతో పాటు ఉన్నతాధికారులు సైతం దృష్టిసారించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిస్థితిని సవిూక్షించారు. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌, 500 మందికి ఒక అబ్జర్వర్‌, ప్రతి రీజినల్‌ సెంటర్‌కు ఓ స్పెషల్‌ అబ్జర్వర్‌, ప్రతీ పరీక్షాకేంద్రానికి ఒక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ను నియమించారు.
ఆన్‌లైన్‌లోనే కౌన్సెలింగ్‌
ఆన్‌లైన్‌లోనే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని మంత్రి కొండ్రు మురళీ వెల్లడించారు. క్రితం సారి లాగే ఈసారి కూడా ప్రవేశప్రక్రియ కొనసాగిస్తామని చెప్పారు. మెడిసిన్‌, అగ్రికల్చర్‌ పరీక్షా పత్రాల కోడ్‌ను మంత్రి కోండ్రు మురళీ విడుదల చేశారు. జేఎన్టీయూహెచ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారుల తో ‘ఎస్‌’ సెట్‌ కోడ్‌ను ఎంపిక చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పూర్తి పారదర్శకంగా పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఇంజనీరింగ్‌ కోడ్‌ను ఉన్నత విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌ మిశ్రా ప్రకటించారు. ‘క్యూ’ సెట్‌ కోడ్‌ను విడుదల చేశారు.
ట్రాఫిక్‌ దిగ్బంధంనంలో..
హైదరాబాద్‌లో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఉదయమే ఇంట్లోంచి బయల్దేరినా ట్రాఫిక్‌ వల్ల కొందరు సమయానికి పరీక్షా కేంద్రానికి రాలేకపోయారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని చెప్పిన అధికారులు.. సరిగ్గా 10 గంటలు కాగానే గేట్లకు తాళాలు వేశారు. దీంతో పలువురు విద్యార్థులు తమను అనుమతించాలని అధికారులను వేడుకున్నారు. వారు కుదరదని తెగేసి చెప్పడంతో రోదిస్తూ వెనుదిరిగారు. మరోవైపు, ఎంసెట్‌ కోలాహలం నగర ట్రాఫిక్‌పై తీవ్ర ప్రభావం చూపింది. సుమారు 90 వేల మందికి పైగా నగరం నుంచే ఈ పరీక్ష రాస్తుండడం, వారంతా శుక్రవారం ఉదయమే ఇంట్లోంచి బయల్దేరడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. తార్నాక చౌరస్తా, ఎల్‌బీనగర్‌-మలక్‌పేట మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు ట్రాఫిక్‌లో చిక్కుకొని ఇబ్బందులకు గురయ్యారు.
కొంపముంచిన ‘నిమిషం’
నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షాకేంద్రంలోకి అనుమతించబోమన్న అధికారులు.. 10 గంటలు దాటిన తర్వాత ఒక్కరిని కూడా లోనికి పంపించలేదు. 10 గంటలకు కాగానే గేట్లకు తాళాలు వేశారు. ఎంసెట్‌ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన వారు ఎంత బతిమాలినా వినలేదు. కూకట్‌పల్లి ఎంఎన్‌ఆర్‌ కాలేజీలోని పరీక్షా కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని లోనికి అనుమతించ లేదు. అలాగే, బండ్లగూడలో ఇద్దరు విద్యార్థులు, నిజాం కాలేజీలో ఆలస్యంగా రావడంతో వారిని పరీక్ష రాసేందుకు అనుమతివ్వలేదు. వరంగల్‌ జిల్లా జనగామలోనూ ఓ విద్యార్థిని వెనక్కి పంపించేశారు. ఎంత వేడుకున్నా అధికారులు కనికరించక పోవడంతో ఏడుస్తూ వెనుదిరిగారు.