ప్రశ్నిస్తే.. పంపిస్తారా?

ఇదేనా ప్రజాస్వామ్యం
పేదల ఉసురు సోనియాకు తగలొద్దనే నా ఆవేదన
సీఎంపై డీఎల్‌ ఫైర్‌
హైదరాబాద్‌, జూన్‌ 4 (జనంసాక్షి) :
‘పరిపాలన వ్యవహారాల్లో లోటుపాట్లపై ప్రశ్నిస్తే.. పంపిస్తారా’ అంటూ మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఫైర్‌ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి, గాంధీ, నెహ్రూల కుటుంబానికి 35 సంవత్సరాలుగా నమ్మకంగా ఉంటూ రావడం వల్లే తనకు బర్తరఫ్‌ బహుమతి ఇచ్చారా అని ప్రశ్నించారు. మంత్రిగా బర్తరఫ్‌ చేశాక తొలిసారిగా డిఎల్‌ అసెంబ్లీలో మీడియా పాయింట్‌లో మాట్లాడారు. తాను ఏమైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశానా, అవినీతి పరుడినా ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయంలో తనను, జేసీ దివాకర్‌రెడ్డిలను పిలిచి రాజీనామా చేయాలని చెప్పగా ఆమోదం అయ్యే వరకు మూడో కంటికి కూడా తెలియదన్నారు. రాజీనామా చేసిన వ్యక్తిని తానన్నారు. ఇప్పుడు కూడా సిఎంగాని కార్యాలయ సిబ్బంది గాని అడిగి ఉంటే రాజీనామా ఇవ్వకపోతే కదా తొలగించాలి అని ప్రశ్నించారు. డిస్మిస్‌ చేసేంత తప్పు ఏం చేశానో ముఖ్యమంత్రే చెప్పాలని ప్రశ్నించారు. సోనియాగాంధీ వద్ద ఇప్పటికే నాలుగు రాజీనామా పత్రాలున్నాయని, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌కు తెలుసని, పత్రాలు సోనియావద్దే ఉన్నాయన్నారు. తాజాగా రెండు నెలలక్రితం కూడా రాజీనామా లేఖ ఇచ్చివచ్చానన్నారు. ఎందుకు ఇలా చేశారో తనకు సమాధానం చెప్పాలన్నారు. నన్ను బర్తరఫ్‌ చేసి మరెందరినో భయపెట్టాలని చూస్తున్నారో సిఎంకు తెలియాలన్నారు. బంగారు తల్లి అంటే కళ్లవెంట నీరు వస్తుందన్నారు. 2005`06లో అమలులో ఉన్న లక్‌పతి పథకానికి సంబందించి బాండ్లు నేటికి రాలేదని తల్లులు రాష్ట్రవ్యాప్తంగా 3.8లక్షల మంది అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ప్రభుత్వ పథకాలలో జరుగుతున్న లోటుపాట్లను నోరు విప్పి మాట్లాడకపోతే కాంగ్రెస్‌పార్టీపై ప్రభావం పడుతుందన్నారు. క్యాబినెట్‌లో చర్చించాల్సిన పథకాలెన్నో కూడా ఆపనికి నోచుకోలేదన్నారు. బంగారు తల్లి పథకం నేటికి కూడా నోచుకోలేదన్నారు. అలాంటప్పడు పెద్దపెద్ద కటౌట్లు, ప్రచారాలు చేసుకోవడం అవసరమా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ కలలు పథకంలో ఎంతమందికి లబ్ది చేకూర్చామో ప్రజలకు తెలపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మంచిగా నడిచే పథకాలను మంచివని, లేనివాటిని ఎత్తిచూపించడం తనకున్న అలవాటన్నారు. తనకు మంత్రి పదవి కావాలని ఏఒక్కరిని అడుగలేదన్నారు. వైఎస్‌ ప్రవేశపెట్టిన లక్‌పతి పథకం మంచిది కాదా ఎందుకు బంగారు తల్లి పథకం తీసుకువచ్చారో సిఎం చెప్పాలన్నారు. రూపాయికి కిలో బియ్యం పథకం, ఇందిర జలప్రభ, యువకిరణాలు పేరుతో పథకాలు ఏమేరకు అమలవుతున్నాయో ప్రజలే రాబోయే ఎన్నికల్లో ఓట్ల ద్వారా చెపుతారన్నారు. ఓ పథకాన్ని తనపేరుతో ప్రారంభించుకున్న ఏకైక వ్యక్తి ప్రస్తుత సిఎం మాత్రమేనన్నారు. వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ బాట తదితర పథకాలన్నీ అమలులో ఏవిధంగా ఉన్నాయో ప్రజలకు బాగా తెలుసన్నారు. ఇప్పటికి లక్‌పతి బాండ్లు రాని తల్లుల ఉసురు కాంగ్రెస్‌పార్టీపైన, సోనియాగాంధీకి తగులకూడదనేదే తన ప్రధాన ఉద్దేశ్యమన్నారు. అమ్మహస్తం పథకం క్రింద తన నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క బ్యాగు ఇప్పటికీ పంపిణీ కానేలేదన్నారు. ఈపథకానికి కూడా కోట్లాది రూపాయలు ప్రచారం క్రింద వెచ్చించారన్నారు. ఇందిరమ్మ కలలు పథకంలో ఏప్రిల్‌, మే, జూన్‌ నెల్లలో ఎన్ని కోట్లు లబ్దిదారులకు చేర్చామో ఓట్‌ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఎందుకు పొందు పర్చలేదని ప్రశ్నించారు. పథకాలు కేవలం వ్యక్తిగత ప్రచారానికి పనికి రాకూడదనేదే తన ఉద్దేశ్యమన్నారు. తనను కక్షగట్టిన సిఎం కావాలనే అబాసుపాలుచేస్తూవస్తున్నారని ఆరోపించారు. 2011లో గచ్చిబౌలి స్టేడియంలో రాజీవ్‌యువకిరణాలు పథకం ప్రారంభానికి ప్రధాని వస్తున్నాడని సిఎం చర్చిస్తాడని ముఖ్యకార్యదర్శి పిలిస్తే అక్కడికి వెళ్లానన్నారు. అయితే ఆనాడు సిఎంతనపట్ల వ్యవహరించిన తీరు తీవ్రంగా భాద కలిగించిందన్నారు. చాలాసార్లు రాజీనామాకోసం హైకమాండ్‌ను కోరినా కూడా అనుమతివ్వలేదన్నారు. నేషనల్‌ హైవేల్లో ఓప్రచార హోర్డింగ్‌ల్లో సోనియాగాంధీ పోటోలు పెట్టినందుకు తీవ్రంగా మందలించడమేకాక తొలగించేలా ఉత్తర్వులు జారీచేశారన్నారు. ఇక్కడేమే పథకాలు రాకముందే భారీబారీ కటౌట్లు, పత్రికల్లో ప్రచారాలను కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారని ఇది ఎంతవరకు సబబని డిఎల్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిణామాలను చక్కదిద్దేందుకు మాత్రమే తాను కలిసిన రెండు మూడుసార్లు సోనియాకు కేంద్రం పెద్దలతో చర్చించాను తప్ప, సిఎంను తొలగించాలని ఒక్కసారి కూడా చెప్పలేదన్నారు. సోనియాగాంధీతో తనకు ఎలాంటి సాన్నిహిత్యం లేదని, 2010లోనే తొలిసారి కలిసానన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏమేరకు ప్రజలకు చేరాయో రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి వచ్చే ఒట్లతోనే తేలుతుందన్నారు. తన నియోజకవర్గం కార్యకర్తలతో రేపు సమావేశం అవుతున్నానన్నారు. ఆ తర్వాత వారు చెప్పే నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటానన్నారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉంటానన్నారు. అంతకుముందు సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం పెట్టేందుకు ప్రయత్నించగా హైడ్రామా చోటు చేసుకుంది. అదే సమయంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశ మందిరంలోకి వెళ్లిన డీఎల్‌ను తన ప్రెస్‌మీట్‌ అయిపోయే వరకూ వేచిచూడాలని కోరారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని సూచించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడి తీరుతానన్న డీఎల్‌ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు.