ప్రాంతాల అభిప్రాయం కాదు

పార్టీల అభిప్రాయం చెప్పండి
మూడు పార్టీలే లక్ష్యంశ్రీ ముందు కాంగ్రెస్‌ వైఖరి చెప్పాలి
టీడీపీ తన తీరును చెప్పి కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచాలి
వైఎస్సార్‌ సీపీ మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపాలి
టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) :
కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఈనెల 28న నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో ప్రాంతాల అభిప్రాయం కాకుండా పార్టీల అభిప్రాయం వెల్లడించాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. అఖిలపక్షంపై కేంద్ర హోంశాఖ రాష్ట్రంలోని తొమ్మిది పార్టీలకు లేఖలు రాసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆల్‌ పార్టీ మీటింగ్‌కు పార్టీకి ఇద్దరు చొప్పున ప్రతినిధులను ఆహ్వానించడం సరికాదని ఆయన అన్నారు. ఎందరిని పిలిచినా అందరూ ఒకే అభిప్రాయం చెప్పాలని కోరారు. కాంగ్రెస్‌, తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు ఈనెల 26లోగా తెలంగాణపై తమ వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఏ పార్టీ అఖిలపక్షంలో రెండు వైఖరులు ప్రకటించినా వారిని తెలంగాణ నుంచి తరమికొట్టడం ఖాయమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ముందుగా వైఖరి చెప్పి అఖిలపక్షానికి హాజరుకవాలని సూచించారు. టీడీపీ తన వైఖరి ప్రకటించి అధికార కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచాలని కోరారు. ఈమేరకు తెలంగాణ ప్రాంత టీడీపీ నాయకులు పార్టీ అధినేతపై ఒత్తిడి తెచ్చి నిర్ణయం ప్రకటించేలా చూడాలన్నారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని ఇక్కడ పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్‌ సీపీ నేతలు కూడా ఒకే వైఖరి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మూడు పార్టీలే లక్ష్యంగా అఖిలపక్ష సమావేశానికి ముందు ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని తెలంగాణ నేతలకు ఇంతకు మించిన మంచి అవకాశం దొరకదన్నారు.