ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు చేయొద్దు : స్మితా సబర్వాల్
కరీంనగర్, జూలై 11 : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు చేయవద్దని, ఆస్తుల ధ్వంసానికి పాల్పడవద్దని జిల్లా కలెక్టర్ స్మితాసబర్వాల్ బుధవారం నాడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రులపై అలాగే ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు జరిగిన సంఘటనలు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చాయని, ఆసుపత్రులపై దాడులు చేయవద్దని పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి డాక్టర్లపై, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రులపై అందులోని డాక్టర్లపై ఇటీవల దాడులు జరిగాయని తెలిపారు. ఆసుపత్రుల సేవలు, చికిత్స విషయంలో రోగులకు అన్యాయం జరిగితే చట్ట పరిధిలో పోరాడాలని, జరిగిన అన్యాయం, ఇబ్బందిపై ఫిర్యాదు చేస్తే జిల్లా యంత్రాంగం ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. దాడుల సంఘటనల వలన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రత్యేక వైద్య నిపుణులు జిల్లాకు వచ్చేందుకు ముందుకు రారని, ఫలితంగా ఆధునిక వైద్య సేవలు ప్రజలకు లభించవని తెలిపారు. ఇదే విషయాలను ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు జిల్లా యంత్రాంగం దృష్టికి తెస్తున్నాయని తెలిపారు. రోగులకు అన్యాయం జరిగితే చట్ట పరిధిలో న్యాయం చేసేందుకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని, ఆసుపత్రులపై దాడులు చేయవద్దని వైద్య సేవలకు విఘాతం కలగకుండా సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.