ప్రైవేటు వాహనంలో ఈవీఎం తరలింపు కలకలం
కరీంనగర్,అక్టోబరు 31(జనంసాక్షి): హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ఈవీఎంను ప్రైవేట్ వాహనంలో తరలిస్తుండగా కాంగ్రెస్, భాజపా కార్యకర్తలు పట్టుకున్నారు. ఈవీఎంలు భద్రపరుసున్న కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల వద్ద కాంగ్రెస్, భాజపా శ్రేణులు వాహనాన్ని అడ్డుకున్నాయి. ఈవీఎంను ఆర్టీసీ బస్సులో కాకుండా ప్రైవేట్ బస్సులో తరలించడంపై పార్టీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో కలిసి హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ వాహనాన్ని అడ్డుకున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి బస్సు పంక్చర్ కావడంతో జమ్మికుంట వద్ద ఆపారంటూ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలను కాంగ్రెస్, భాజపా నాయకులు ఎన్నికల కమిషనర్‌కు పంపారు. ఈవీఎంను తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీవీ ప్యాట్ తరలింపుపై పుకార్లు నమ్మొద్దు: ఆర్వో రవీందర్‌రెడ్డి
హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి వీవీ ప్యాట్ తరలింపు విషయం చర్చనీయాంశమైన నేపథ్యంలో హుజూరాబాద్ రిటర్నింగ్ అధికారి(ఆర్వో) రవీందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మొద్దని ప్రకటనలో వెల్లడిరచారు. పనిచేయని వీవీప్యాట్‌ను ఒక అధికారిక వాహనం నుంచి మరో అధికారిక వాహనంలోకి తరలించిన సమయంలో ఎవరో వీడియో తీసి దానిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆర్వో అన్నారు. పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు మాక్ పోలింగ్ నిర్వహించే క్రమంలో వీవీ ప్యాట్ పని చేయలేదని దాని స్థానంలో మరో దానితో పోలింగ్ నిర్వహించామని ఆయన తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని నవంబర్ 2వ తేదీ జరగనున్న లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
వీవీ ప్యాట్ల ఘటనపై వివరణకు సీఈవో ఆదేశం
హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా వీవీ ప్యాట్లు తారుమారయ్యాయనే వార్తలొచ్చాయి. దీంతో పాటు భాజపా నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)కి ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్, హుజూరాబాద్ ఆర్వోకు సీఈవో ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఆయన ఎన్నికల అధికారులతో నిర్వహించిన సవిూక్ష సందర్భంగా ఈ మేరకు ఆదేశించారు. మరోవైపు అన్ని రాజకీయ పార్టీల నేతలతో రేపు సమావేశం కానున్న సీఈవో.. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ 2022 ప్రక్రియపై చర్చించనున్నారు.