ఫిక్సింగ్‌ వెనుక సెలబ్రిటీలు

బీసీసీఐ శ్రీనివాసన్‌ బంధువు
వారంలో మరికొన్ని అరెస్టులు
నిందితులను కోర్టుకు హాజరుపరిచిన పోలీసులు
న్యూఢిల్లీ, మే 22 (జనంసాక్షి) :
ఐపీఎల్‌ స్పాట్‌ఫిక్సింగ్‌ డొంక కదులుతోంది. ఫిక్సింగ్‌ వెనుక కుట్రను ఛేదించే యత్నంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫిక్సింగ్‌తో బాలీవుడ్‌కు సంబంధమున్నట్టు వస్తోన్న వార్తలు రోజురోజుకూ బలపడతున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నటుడు విందూ ధారాసింగ్‌ పోలీసు విచారణలో మరికొందరి ఆటగాళ్ల పేర్లు వెల్లడించినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం వేరే జట్లకు చెందిన నలుగురు ఆటగాళ్లకు ఫిక్సింగ్‌తో లింకున్నట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు లభించలేదని, విచారణ జరిపి త్వరలోనే కొందరిని అరెస్ట్‌ చేసే అవకాశమున్నట్టు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. దీంతో ఈ వారంలో మరికొందరి అరెస్ట్‌ జరిగే అవకాశముంది. అలాగే విందూ ధారాసింగ్‌తో పాటు పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా ఫిక్సింగ్‌లో పాలుపంచుకున్నారన్న అనుమానంతో పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీసీసీఐ ప్రెసిడెంట్‌ శ్రీనివాసన్‌ బంధువు గురుతో విందూ ధారాసింగ్‌ సన్నిహితంగా ఉండేవాడని తెలుస్తోంది. చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుతో గురు సన్నిహితంగా మెలగడంతో పాటు ధారాసింగ్‌తో కలిసే బుకీలతో రిలేషన్‌ నడిపినట్టు సమాచారం. దీంతో పోలీసులు గురుకు కూడా సమన్లు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నటుడు విందూ ముంబైకి చెందిన బుకీలతో తరచుగా సంప్రదింపులు జరిపినట్టు అతని ఫోన్‌ కాల్స్‌ జాబితా ద్వారా వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు.
విందూ ధారాసింగ్‌ గురు ద్వారానే చెన్నై ఫ్రాంచైజీ వీఐపీ బాక్స్‌లో కూర్చుని మ్యాచ్‌లు వీక్షించాడు. ఇక స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తోన్న ముగ్గురు రాజస్థాన్‌ క్రికెటర్లపై ఆరోపణలు రుజువైతే యావజ్జీవశిక్ష పడడం ఖాయమని పోలీసులు చెబుతున్నారు. కాగా శ్రీశాంత్‌ స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు భావిస్తోన్న పంజాబ్‌ మ్యాచ్‌లో అతను నోబాల్‌ వేసినప్పటకీ అంపైర్‌ గమనించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. శ్రీశాంత్‌ వేసిన ఆ ఓవర్‌లో తొలి ఐదు బంతులకు 14 పరుగులు ఇవ్వగా, చివరి బంతిని నోబాల్‌గా వేసాడు. అయితే అంపైర్‌ దీనిని గుర్తించలేదని శ్రీశాంత్‌ బుకీతో సంభాషించినప్పుడు చెప్పాడు. విచారణలో ఈ విషయం కూడా బయటపడడంతో ఆ మ్యాచ్‌కు సంబంధించి వీడియో పుటేజ్‌ను బీసీసీఐని అడిగినట్టు పోలీసులు చెప్పారు.