ఫిజీ పార్లమెంట్‌లో మోడీ ప్రసంగం

Untitled-1

70మిలియన్‌డాలర్ల ఆర్థికసాయం

తక్షణసాయంగా 5మిలియన్‌డాలర్లు

పలు ఒప్పందాలపై సంతకాలు

సువా, నవంబర్‌ 19 (జనంసాక్షి) : భారత ప్రధాని నరేంద్రమోడీ ఫిజీ పార్లమెంట్‌లో బుధవారం ప్రసంగించారు. దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఆధునికీకరణ కోసం 70మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించారు. 5మిలియన్‌ డాలర్లను తక్షణ సాయంగా మోదీ ప్రకటించారు. పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఫిజీ సాంకేతికతంగా మరింతగా అభివృద్ధి చెందేందుకు భారత్‌ సహకరిస్తుందని నరేంద్రమోదీ అభయమిచ్చారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఫిజీ యువత ప్రపంచ దేశాలతో పోటీపడాలని ఆయన అభిలాషించారు. ఫిజీలో పాడి పరిశ్రమ అభివృద్ధికి భారత్‌ తన వంతు సహకారాన్ని అందిస్తుందని తెలిపారు.  కాగా అంతకు ముందు మోదీ…ఫిజీ ప్రధాని బైనీమర్మతో భేటీఅయ్యారు. ఈ సందర్భంగా ఫిజీతో మూడు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గత 33 ఏళ్లలో ఫిజీని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీయే. మూడు దేశాల పర్యటనలో భాగంగా మోదీ మయన్మార్‌, ఆస్టేల్రియా సందర్శించిన సంగతి తెలిసిందే. ఫిజీ పర్యటన అనంతరం మోదీ స్వదేశం తిరిగి రానున్నారు. ఆస్టేల్రియా పర్యటన ముగించుకుని వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఫిజీ చేరుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మోదీ ఫిజీ పార్లమెంట్‌లో ప్రసంగించారు. రాజకీయ కారణాల నేపథ్యంలో అక్కడి ప్రతిపక్షం పార్లమెంట్‌లో మోదీ ప్రసంగానికి హాజరు కాలేదు. అనంతరం 12 పసిఫిక్‌ ద్వీప దేశాల ప్రతినిధులతో మోదీ సమావేశమయ్యారు. ఫిజీ ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఫిజీ పర్యటన సందర్భంగా మోదీ భారీగా ఆర్థిక సాయం ప్రకటించారు. ఫిజీలో విద్యుత్‌ ప్లాంట్‌కోసం 7కోట్ల డాలర్ల సాయం ప్రకటించారు.

రాబోయేది భారత్‌ శకం : భారత్‌ విశ్వగురువు పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌ తన ప్రజాస్వామ్య, యువ జనాభా శక్తిని ఉపయోగించుకొని మానవాళికి మేలు చేస్తుందని తెలిపారు. రాబోయే తరం అంతా టెక్నాలజీదేనని.. దాంతో సమానంగా పరుగులు పెడితే కొత్త ఆవిష్కరణలు సాధ్యమమవుతాయన్నారు. రాబోయే జ్ఞానయుగంలో భారత్‌ విశ్వగురువు పాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు. ఫిజీ పర్యటనలో మోడీ బుధవారం భారత్‌కు తిరుగుపయానమయ్యారు. అంతకు ముందు ఫిజీ ప్రధాని బైనీమర్మతోనూ సమావేశమై.. ఇరుదేశాల మధ్యద్వైపాక్షి సంబంధాలపై చర్చించారు. అనంతరం ఫిజీ టెక్నికల్‌ యూనివర్సిటీలో పౌర సమాజ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తానికి మేలు చేసేందుకు భారతదేశం నైపుణ్యాల అభివృద్దికి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ప్రపంచ మానవాళి అభివృద్దికి ఇండియా కృషఙ చేస్తుందన్నారు. భారతదేశంలో పాతకాలం నాటి రుషులు, మునులు కూడా అంతర్జాతీయ బాధ్యత గురించి చెప్పారని గుర్తు చేశారు. వివిధ దేశాల మధ్య ఉన్న డిజిటల్‌ అంతరాలకు ముగింపు పలకాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తన పర్యటన ద్వారా భారత్‌-ఫిజీ దేశాల మధ్య ఓ కొత్త శకం ప్రారంభమైందని తెలిపారు. భారత్‌కు ఫిజీ అత్యంత ప్రాధాన్యమైన మిత్రదేశమని మోడీ పేర్కొన్నారు. తన పర్యటన ద్వారా గత సంబంధాలు మరింత బలపడనున్నాయని తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్యం, వాతావరణ మార్పులు, భద్రతామండలి విస్తరణ వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య పరస్పర మద్దతు కొనసాగుతుందని చెప్పారు. అలాగే రక్షణ రంగం, భద్రతా అంశాల్లో సహకరించుకోవడంతో పాటు ఇరుదేశాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోనున్నట్లు వివరించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అవగాహనతో ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. మోడీ పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని ఫిజీ ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ లైబ్రరీ నిర్మాణం, వాణిజ్య అభివృద్ధికి, చిన్నతరహ పరిశ్రమల స్థాపనకు సహకరిస్తున్న భారత్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.