ఫిరాయింపులపై కాంగ్రెస్‌ గరం గరం

Untitled-1

వైఎస్‌ చేర్చుకున్నప్పుడు మీరేం చేశారు..?

హరీశ్‌, ఈటెల ధ్వజం

అధికారంలో కొనసాగే హక్కు లేదు : జానా

13 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ఒకరోజు సస్పెన్షన్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 18 (జనంసాక్షి) : పార్టీ ఫిరాయింపుల అంశంపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ పార్టీ గరం గరమైంది. దీంతో శాసనసభను మరోసారి స్తంభింపజేసింది. ప్రశ్నోత్తరాలను అడ్డుకొని ఫిరాయింపులపై చర్చకు పట్టుబట్టింది. ఫలితంగా సభ రెండుసార్లు వాయిదా పడింది. అయినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన విరమించకపోవడంతో 13 మందిపై ఒకరోజు సస్పెన్షన్‌ వేటు పడింది. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే.. పార్టీ ఫిరాయింపులపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ప్రశ్నోత్తరాలు వాయిదా వేసి, తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాల్సిందేనని కోరుతూ ప్రతిపక్ష సభ్యులు తమ స్థానాల్లోంచి లేచి నినాదాలు చేశారు. వారి ఆందోళనల మధ్యే సభాపతి మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. దీంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పోడియంలోకి దూసుకువచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గందరగోళం నెలకొనడంతో సభ ప్రారంభమైన పది నిమిషాలకే వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన అనంతరం మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. అనంతరం బడ్జెట్‌ పద్దులపై చర్చ చేపట్టాలని సూచించారు. అయితే, పార్టీ ఫిరాయింపులపై చర్చ జరపాల్సిందేనని కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన కొనసాగించారు. సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. దీంతో జానారెడ్డికి మాట్లాడే అవకాశం కల్పించారు.

ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదు : జానా

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీఆర్‌ఎస్‌కు అధికారంలో కొనసాగే హక్కు లేదని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న ఈ ప్రభుత్వంపై ప్రజా సమస్యలపై చర్చించే అవకాశమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికైన వారు ఫిరాయింపులకు పాల్పడడం సరికాదని తెలిపారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికైన సభ్యులు పార్టీలు ఫిరాయించడం సరికాదన్నారు. పార్టీ ఫిరాయింపులపై చర్చ తర్వాతే ప్రశ్నోత్తరాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదని విమర్శించారు. ఫిరాయింపులపై సభ తగిన విధంగా స్పందించాలని కోరారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ సభ్యులు విూరూ పార్టీ మారారు కాదా? అని జానారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో ఆయన స్పందిస్తూ.. తాను ఫిరాయింపులకు పాల్పడలేదని.. రాజీనామా చేసిన తర్వాతే పార్టీ మారానని చెప్పారు. ఫిరాయింపులు మంచి సంప్రదాయం కాదన్నారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. సభ్యుల నిరసనలు, నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియంలోకి దూసుకెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 

వైఎస్‌ చేర్చుకున్నప్పుడు మీరేం చేశారు..? : హరీశ్‌, ఈటెల

అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, సభను అడ్డుకోవడం సరికాదని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శాసనసభ సమయాన్ని వృథా చేయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. సభను పదే పదే అడ్డుకోవడం సరికాదని మంత్రి పేర్కొన్నారు. అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, అయితే, అంతకు ముందు ప్రశ్నోత్తరాలు కొనసాగే అవసరం ఉందన్నారు. ప్రశ్నోత్తరాలు చాలా ముఖ్యమైన అంశమని, దాని తర్వాత ఏ అంశంపైన అయినా చర్చిద్దామని తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన తీర్మానంపై స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, వాటి మేరకు సభాపతి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. స్పీకర్‌ పరిధిలోని అంశంపై ఆందోళన చేయడం సబబు కాదన్నారు. ఫిరాయింపులపై సభను అడ్డుకుంటున్న కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ.. పూర్తి మెజార్టీ ఉన్న ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని చీల్చిన విషయం గుర్తు లేదా? వైఎస్‌ రాజశేఖరరెడ్డి టీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించలేదా? తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్చుకోలేదా? అప్పుడు మంత్రిగా ఉన్న జానారెడ్డి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సభ సమయం వృథా చేయొద్దని, సభ జరిగేందుకు సహకరించాలని కోరారు. మంత్రి విజ్ఞప్తిని పట్టించుకోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆందోళన కొనసాగించారు.

 

విపక్షాలకు చిత్తశుద్ది లేదు: ఈటెల

ఈ నేపథ్యంలో మంత్రి ఈటెల రాజేందర్‌ జోక్యం చేసుకుంటూ.. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పదే పదే సభకు అంతరాయం కలిగించడం సరికాదన్నారు. అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకు సహకరించాలని కోరారు. సభను అడ్డుకోవడం వల్ల ప్రజలకు నష్టం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వానికి అర్హత ఉందా.. లేదా? అన్నది ప్రజలే నిర్నయిస్తారన్నారు. ప్రజా సమస్యలపై చర్చకు సహకరించండని ప్రతిపక్షాన్ని కోరారు. ఈ నేపథ్యంలో మరోమారు అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సభ మరోమారు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన అనంతరం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆందోళనను కొనసాగించారు. బడ్జెట్‌ డిమాండ్లపై చర్చ ప్రారంభించాలని స్పీకర్‌ కాంగ్రెస్‌కు అవకాశమిచ్చారు. అయితే, వారు మాట్లాడకుండా పోడియంలోకి వెళ్లి నిరసన చేపట్టారు. పలుమార్లు సభాపతి కోరినా మాట్లాడేందుకు నిరాకరించారు.

 

13 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ఒక్కరోజు సస్పెన్షన్‌…

అసెంబ్లీ చరిత్రలో ఇదో దుర్దినమని వ్యాఖ్యానించారు. సభ నుంచి సస్పెండ్‌ కావడానికే ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారని, విూడియాలో హైలైట్‌ కావడానికే వారు అలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సభ జరగాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశ్యంతో తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు చెందిన 13 మంది ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్‌ చేయాలని హరీశ్‌రావు తీర్మానం ప్రవేశపెట్టారు. పువ్వాడ అజయ్‌, డీకే అరుణ, భాస్కరరావు, మల్లు భట్టివిక్రమార్క, గీతారెడ్డి, జీవన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మావతిరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను సభ నుంచి సస్పెండ్‌ చేయాలని ప్రతిపాదించారు. సభామోదంతో స్పీకర్‌ 13 మందిని ఒకరోజు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సభలోనే ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. ముఖ్యమంత్రి డౌన్‌డౌన్‌ అంటూ నినదించారు. దీంతో మార్షల్స్‌ వచ్చి వారిని బయటకు తీసుకెళ్లారు. తమ పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ప్రతిపక్ష నేత జానారెడ్డి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. తమ సస్పెన్షన్‌ను నిరసిస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేత ఛాంబర్‌ ఎదుట ఉన్న ద్వారం వద్ద బైఠాయించారు.