ఫోటో జర్నలిజం, డిజిటల్ ప్రొడక్షన్ టెక్నిక్స్ ఇన్ మీడియా
కోర్సులో చేరుటకు దరఖాస్తులు
నల్గొండ, జనవరి 31 (): ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ పైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఫోటో జర్నలిజం, డిజిటల్ ప్రొడక్షన్ టెక్నిక్స్ ఇన్ మీడియా కోర్సులలో చేరుటకు ఆసక్తి గల విలేకరులు, సంపాదన వర్గం సిబ్బంది దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రెస్ అకాడమీ కార్యదర్శి జి. సన్యాసిరావు కోరారు. రాష్ట్రంలోని వివిధ పత్రికలు, టి.వి. చానెళ్ళలో పనిచేస్తున్న విలేకరులు, సంపాదన వర్గ సిబ్బంది మూడు నెలల సర్టిఫికేట్ కోర్సులో చేరుటకు అర్హులని ఆయన తెలిపారు.ప్రతి ఆదివారం మాత్రమే తరగతులు నిర్వహించబడతాయని, కోర్సుకు అయ్యే ఖర్చు రూ. 7వేలకు గాను ప్రెస్ అకాడమీ రూ. 5వేలు భరిస్తుందన్నారు. కోర్సులో చేరదలచుకునే విద్యార్థి తన వంతుగా రెండువేలు చెల్లించవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి కోర్సులో 20మంది జర్నలిస్టులకు మాత్రమే ప్రవేశం ఉన్నందున ఆసక్తి గల జర్నలిస్టులు దరఖాస్తు ఫారంతో రూ. 100లు డిడిని సెక్రటరీ, ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరున జత చేసి ఫిబ్రవరి 8లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. దరఖాస్తు ఫారాలను ప్రెస్ అకాడమీ కార్యాలయం లేదా డిపిఆర్‌ఓ, వెబ్‌సైట్ నుండి నేరుగా పొందవచ్చునని ఆయన తెలిపారు. కోర్సు కాలం ముగిసి ఉత్తీర్ణులైన వారికి ప్రెస్ అకాడమీ, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, జవహర్‌లాల్‌నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో సర్టిఫికెట్ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.