ఫౌంహౌస్‌కు టీ ఎంపీలు

డెడ్‌లైన్‌కు ముందే గోడ దూకండి : కేసీఆర్‌
టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రాజయ్య, మంద, వివేక్‌, కేకే సుముఖత
హైదరాబాద్‌/మెదక్‌, మే 20 (జనంసాక్షి) :
టీ కాంగ్రెస్‌ ఎంపీలు మంద జగన్నాథం, డాక్టర్‌ జి. వివేకానంద, సిరిసిల్ల రాజయ్య, సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు కె. కేశవరావు సోమవారం టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. తెలంగాణపై ఈ నెల 30లోగా తేల్చాలని అల్టిమేటమ్‌ ఇచ్చి 24 గంటలుకూడా గడవక ముందే ముగ్గురు కేసీఆర్‌ను కలిశారు. మెదక్‌ జిల్లా జగదేవపూర్‌ సమీపంలో ఉన్న కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో వీరు భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు హరీష్‌ రావు, కె.తారక రామారావులు పాల్గొన్నారు. తాజా రాజకీయాలు, తెలంగాణ అంశం తదితర విషయాలను వీరు చర్చించి ఉంటారని భావిస్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తమకు మళ్లీ బెర్తులు ఖారరు చేస్తేనే పార్టీలోకి వచ్చే విషయాన్ని వారు ఖారరు చేసుకునేందుకే ఈ భేటీ జరిగి ఉంటుందని కూడా భావిస్తున్నారు. కేసీఆర్‌తో భేటీ అయిన ఎంపీలు  జూన్‌ 3లోగా టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఇక తెలంగాణ ఇవ్వదనే అభిప్రాయానికి వారు వచ్చినందు వల్లే తెరాసలో చేరేందుకు ముహూర్తం కోసం కెసిఆర్‌తో భేటీ- అయ్యారని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ఉద్యమం జోరుగా ఉండటంతో పాటు అధిష్టానం వైఖరి కూడా వారికి అసంతృప్తిని కలిగిస్తోంది. తెలంగాణపై ఢిల్లీ కాంగ్రెసు పెద్దలు రోజుకో మాట మాట్లాడుతున్నారు. తెలంగాణ అంశాన్ని తేల్చుతామని చెబుతున్నారే కానీ నిర్దిష్ట సమయంలోగా తేల్చుతామని చెప్పడం లేదు. మరోవైపు వాయలార్‌ రవి తెలంగాణను కాఫీ, టీలతో పోల్చడం, పిసి చాకో తెలంగాణ తమ అజెండాలో లేదని నాలిక్కర్చుకోవడం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు జీర్ణించుకోవడం లేదు. కెకె, మంద జగన్నాథం, రాజయ్య ఆదివారం వివేక్‌ ఇంట్లో భేటీ అయిన విషయం తెలిసిందే. వారు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ నెలాఖరులోగా తెలంగాణపై అధిష్టానం తేల్చాలని లేదంటే తాము ఇతర పార్టీలలో చేరక తప్పదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎలాగూ తెలంగాణను కాంగ్రెస్‌  తేల్చదని నిర్ణయానికి వచ్చారు. అలాగే ప్రభుత్వం కూలుతుందన్న భయం కూడా యూపిఎలో కనిపించడం లేదు.