బంగారు తెలంగాణ కల సాకారానికి చంద్ర’కళ’లు కావాలి
అవినీతిపరుల సింహస్వప్నం తెలంగాణ భూమిపుత్రిక
యూపీలోని బులంద్‌శహర్ జిల్లా కలెక్టర్‌గా విధులు
లంచగొండుల తాటతీస్తున్న యూపీ కేడర్ ఐఏఎస్ చంద్రకళ
హైదరాబాద్, డిసెంబర్ 26(జనంసాక్షి):
అందలమెక్కంగనే, అధికారం దక్కంగనే అవినీతికి పాల్పడేందుకు లైసెన్స్ పొందినట్లు భావించే అధికారులే మనకు అత్యధిక సంఖ్యలో టచ్ అవుతుంటారు. అవినీతిలో ప్రపంచస్థాయిలో గొప్ప రికార్డున్న మనదేశంలో నిజాయితీకి నిలిచి, ప్రజాసేవను పరమార్థంగా భావించే అత్యున్నత అధికారులు అత్యంత అరుదు. అట్లాంటి అరుదైన ఓ అధికారి తెలంగాణ భూమి పుత్రిక కావటం మనందరికీ గర్వకారణం. అవినీతిపరులకు సింహస్వప్నంగా నిలిచిన ఆమె.. అవినీతి అధికారులను నిలదీస్తున్న వీడియో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల మన్ననలు పొందుతూ సంచలనం సృష్టిస్తోంది. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. యూకేలోని డెయిలీ మెయిల్ దినపత్రిక సైతం ఈ తెలంగాణ ముద్దుబిడ్డపై కథనాన్ని ప్రచురించింది. ఈ అధికారిణి మన కరింనగర్ జిల్లా రామగుండంలో జన్మించిన ఐఏఎస్ ఆఫీసర్ చంద్రకళ. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట్ మండలం గర్జనపల్లి గ్రామానికి (అత్తగారు) చెందిన ఈమె 2008లో ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారిణిగా ఎంపికయ్యారు. కోటి వుమెన్స్ కాలేజ్‌లో బీఏ చదివిన ఈమె ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తిచేశారు. భర్త రాములు సహకారంతో ఐఏఎస్‌లో 409 ర్యాంకు సాధించిన ఈమె యూపీ కేడర్‌లో తొలుత అలహాబాద్ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత హమీర్‌పూర్, మథుర జిల్లాలకు కలెక్టర్‌గా పని చేశారు. ప్రస్థుతం యూపీ రాష్ట్రంలోని బులంద్‌శహర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే ఆమె పరిధిలో నిర్మిస్తున్న ఓ రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించారు. నాణ్యతలేని రోడ్డువేస్తున్న కాంట్రాక్టర్‌ను, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను ఏకిపారేశారు. షటప్ అంటూ నోరు మూయించారు. ప్రజాధనం దుర్వినియోగం చేయటానికి సిగ్గు లేదా అన్నారు. ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల మన్ననలు పొందుతోంది. అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న చంద్రకళకు అంతా హ్యాట్సాఫ్ అంటున్నారు. బులంద్ శహర్ కలెక్టర్లుగా పనిచేసిన వారిలో భూక్యా అత్యంత నిజాయితీ గల అధికారిణిగా కీర్తి సంపాదించారు. ఈమె అప్పట్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ వన్ ఎగ్జామ్‌లో ఎస్సీ,ఎస్టీ అభ్యర్థుల్లో టాపర్‌గా నిలిచారు.
అవినీతి పట్ల కఠిన వైఖరి అవలంబించే ఈమెలో అనగారిన వర్గాలపట్ల వల్లమాలిన ప్రేమ కురిపించే ఓ మానవతామూర్తి ఉంది. మథుర జిల్లా మెజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నప్పుడు అక్కడి మహిళా,శిశు సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. పదేళ్ల బిడ్డకు తల్లైన తాను, స్థానికంగా అనాథాశ్రమాల్లో పెరుగుతున్న చాలా మంది పిల్లలతో ‘డీఎం మమ్మీ’ అని పిలిపించుకున్నారు. నిజాయితీగా వ్యవహరించేవాళ్లు ముక్కుసూటిగా మాట్లాడటం సహజం. ఈమె ముక్కుసూటి వ్యవహారశైలివల్ల ఈమె అంటే గిట్టని నేతలూ ఉన్నారట. దీని మూలంగా పలుమార్లు బదిలీ అయ్యారట. మథురలో కేవలం 4 మాసాలే పనిచేసినా అక్కడి స్థానికులతో షెభాష్ అనిపించుకుంది చంద్రకళ. ఈమె బదిలీ వార్త విని జిల్లా ప్రజలు షాకయ్యారట. బదిలీ వద్దంటూ ఆందోళనలు చేశారంటే ఆమె ఔన్నత్యమేంటో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా ఇలాంటి అధికారులనే కావాలనుకుంటున్నరు. రాష్ట్ర విభజన అనంతరం తొలి తెలంగాణ సీఎంగా ప్రమాణం చేసిన కె.చంద్రశేఖర్‌రావు రాÄష్ట అభివృద్ధికి ఎంతో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిభతోపాటు నిజాయితీ ఉన్న అధికారులను సీఎం పేషీలో నియమించటమే కాకుండా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రణాళికలు వేసేందుకు ఉన్నతమైన అత్యుత్తమ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆంధ్ర వలస పాలనలో దోపిడీకి గురైన తెలంగాణ పూర్వవైభవం పుణికిపుచ్చుకునేందుకు మాత్రమే కాక, మరింత శరవేగంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ బాటలు వేస్తున్నారు. ఇలాంటి కోవలోనే సీఎం తన కోటరీలో కొంతమంది అత్యంÛత సామర్థ్యం ఉన్న అధికారులను ఎంపిక చేశారు. అలా నియమించిన వారే స్మితా సబర్వాల్. మెదక్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే ఆమె ప్రతిభను గుర్తించిన కేసీఆర్.. సీఎం పదవి చేపట్టిన వెంటనే తన పేషీలో నియమించారు. చంద్రకళ కూడా ఇలాంటి కోవకు చెందిన అధికారిణే. మన బంగారు తెలంగాణ కల సాకారానికి ఇలాంటి చంద్రకళల అవసరం ఎంతో ఉంది.