బంగారు దుకాణంలో పట్టపగలే చోరీ
జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 20 : గద్వాల పట్టణంలోని రాజవీధిలో బంగారు దుకాణంలో దొంగలుపడ్డారు. 14 తులాల బంగారు, రూ.లక్ష నగదు చోరీకి గురయ్యాయి.
గద్వాల సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గద్వాల పట్టణానికి చెందిన రవి రాజవీధిలో గాయత్రీ జ్యూవెలరీ బంగారు దుకాణం నిర్వహిస్తున్నాడు. అతను ప్రతిరోజూ దుకాణాన్ని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరచిఉంచుతాడు. మంగళవారం రాత్రి దుకాణాన్ని మూసివేసి ఇంటికెళ్లాడు. రోజు మాదిరిగానే బుధవారం ఉదయం దుకాణం తెరవడానికి దుకాణం వద్దకు వచ్చాడు. బంగారు ఆభరణాలున్న బ్యాగును దుకాణంలో పెట్టి తన షాప్ ముంగట ఉన్న బండిని పార్కింగ్ చేయడానికి వెళ్లాడు. అక్కడే రెక్కి నిర్వహించిన గుర్తుతెలియని వ్యక్తులు బంగారు ఆభరణాలున్న బ్యాగును ఎత్తుకెళ్లి అక్కడ నుంచి పరారయ్యాడు. కొద్ది సేపటికి గమనించిన నిర్వాహకుడు రవి బ్యాగు కోసం వెతకసాగాడు. బంగారు ఆభరణాలున్న బ్యాగ్ అపహరణకు గురైనట్లు గుర్తించి.. వెంటనే గద్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుమారు 14తులాల బంగారు ఆభరణాలు, లక్ష రూపాయల నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు గద్వాల్ సీఐ చంద్రశేఖర్, రూరల్ ఎస్ఐ ఆనంద్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.