బడిబాటకు ప్రత్యేక ఏర్పాట్లు

కార్యాచరణ రూపొందించిన డిఇవోలు
2న అవతరణ ఉత్సవాలకు స్కూళ్లు సిద్దం
ఖమ్మం,మే31(జ‌నం సాక్షి): శుక్రవారం పాఠశాలలు తెరవనుండడంతో ఆనాడే  పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నారు.  ఆ రోజు పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పండుగ వాతావరణం కల్పించాల్సి ఉండడంతో రెండురోజుల నుంచే గ్రామాల్లో పాఠశాలలను శుభ్రం చేసేపని కొనసాగుతోంది. ఇకపోతే 2న అవతరణ ఉత్సవాలు జరుగనున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా ఏర్పట్లు చేస్తున్నారు. జిల్లాల్లో జూన్‌ 4 నుంచి 8వ తేదీ వరకు ‘బడిబాట’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 7గంటల నుంచి 11గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రభుత్వం ఉపాధ్యాయులను సన్నద్ధం అయ్యారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలను, ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సౌకర్యాలకు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయటం కార్యక్రమ లక్ష్యం. ప్రభుత్వ ఉపాధ్యాయుల అర్హతలు, ఇతర వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు, ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలను ప్రచారం చేస్తారు. పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు సహకారం తీసుకోనున్నారు. బడిబాటలో పాఠశాల విద్యా కమిటీలు, డ్వాక్రా సంఘాలు, ఇతర స్వచ్ఛంద సేవా సంస్థల్ని కూడా భాగస్వాముల్ని చేస్తారు. వివిధ స్థాయిల్లోని అధికారులను సైతం బాధ్యుల్ని చేయనున్నారు. ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి పి.మదన్‌మోహన్‌,  భద్రాద్రి జిల్లా విద్యాధికారి వాసంతి ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాల గురించి ఎంఈవోలకు దిశానిర్దేశర చేశారు.
పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, కల్పించాల్సిన ఇతర సౌకర్యాల గురించి కరపత్రాలు, గోడపత్రికలు, ప్లెక్సీల ద్వారా ప్రచారం చేస్తారు. గత ఏడాది కంటే 10శాతం అధికంగా పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించటం లక్ష్యంగా పెట్టుకున్నారు. 5వ తరగతి, 7వ తరగతి ఉత్తీర్ణులైన పిల్లలు ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ఎంఈవోలు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బడిబయట పిల్లలను గుర్తించి బడిలో చేర్పించే బాధ్యత సంబంధిత ప్రధానోపాధ్యాయులకే అప్పగించారు. వారిని గుర్తించటంతోపాటు పాఠశాలలో విధిగా చేర్పించాలి. ఐదేళ్లలోపు పిల్లలు అంగన్‌వాడీల్లో ఎక్కువగా ఉంటున్నందున వారందర్నీ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించే బాధ్యతను కూడా ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ఎట్టి పరిస్థితిలోనూ పడిపోకుండా ఉండే చర్యలు తీసుకుంటారు. గ్రావిూణ ప్రాంతాల్లో అనేక మంది బాలికలకు స్థానికంగా చదువుకునే అవకాశం లేక బడిమానేస్తుంటారు. ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల గురించి కూడా ప్రచారం నిర్వహిస్తారు. వీటికి ఇప్పటికే పాఠశాలల్లో పనిచేసే సీఆర్‌టీలు ప్రచారం మొదలు పెట్టారు.